పదిహేడేళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించిన రోజు. లంక బౌలర్లపై విరుచుకుపడుతూ.. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. 2005లో మహీ ఆడిన ఆ తుపాను ఇన్నింగ్స్‌ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. తాజాగా ఈ మ్యాచ్‌ను గుర్తుచేస్తూ బీసీసీఐ ఓ వీడియోను పంచుకుంది. అది ప్రస్తుతం సోషల్‌మీడియాలో లైక్స్, రీట్వీట్స్తో దూసుకుపోతోంది.
ఫుల్ జోష్‌తో.. అప్పుడు ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక.. భారత పర్యటనకు వచ్చింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ జైపుర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా టీమ్ఇండియాతో తలపడింది. అప్పుడు ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పటికే మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న భారత జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. అయితే, లంక ఓపెనర్ కుమార్ సంగక్కర సెంచరీ(138*), మహేల జయవర్దనే(71) చెలరేగడం వల్ల నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
మహీ తుపాన్ ఇన్నింగ్స్.. నిరాశపరిచిన సచిన్..ఈ క్రమంలోనే లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు.. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 39 పరుగులతో శుభారంభం అందించాడు. కానీ మరో ఓపెనర్ దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ మాత్రం(2) పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసం సృష్టించాడు.