Dhoni Cricket Academy: టీమ్ఇండియా సారథిగా భారత్‌కు ఎన్నో మరపురాని విజయాలు అందించిన కెప్టెన్లలో ధోనీకి ప్రత్యేకస్థానం ఉంది. కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతూనే మెరుపు వేగంతో వికెట్‌కీపింగ్ చేస్తూ, బ్యాట్స్‌మెన్‌గా పవర్ఫుల్ షాట్లు కొడుతూ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు.. యువతకు, తర్వాత తరానికి మెరుగైన క్రికెట్ అందించేందుకు కృషి చేసేవాడు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ధోనీ క్రికెట్ అకాడమీ పేరుతో శిక్షణ కేంద్రాలను స్థాపించాడు. బెంగళూరు, అహ్మదాబాద్, కాన్పూర్, దిల్లీ తదితర ప్రాంతాల్లో ఉన్న ఈ అకాడమీ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ప్రారంభమైంది.
హైదరాబాద్ నగర శివార్లలోని నాచారం వద్ద ఉన్న దిల్లీ పబ్లిక్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ అకాడమీని శుక్రవారం ప్రారంభించారు. ఫిబ్రవరి 20 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని నిర్వహకులు వెల్లడించారు. మొదటి విడతలో 200 మందిని తీసుకుంటామని.. ఈ అకాడమీలో చేరాలంటే విద్యార్థులకు కనీసం ఏడేళ్లు నిండి ఉండాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇచ్చి వారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే తమ అకాడమీ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.