MS Dhoni Jadeja: శనివారమే (మార్చి 26) ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఆయా జట్లంతా సాధన చేస్తూ తలమునకలు కాగా... ఎంఎస్ ధోనీ మాత్రం తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై దృష్టిపెట్టినట్టున్నాడు. ఈ సీజన్ వరకు ధోనీనే సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తాడని భావించిన అభిమానులను షాక్‌కు గురి చేస్తూ సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతే ఒక్కసారిగా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ముందే అనుకున్న విధంగా తన వారసుడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకే కెప్టెన్సీ బ్యాటర్‌ను అందించాడు. ఈ మేరకు సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. టీమ్‌ఇండియాలోనూ, సీఎస్‌కే తరఫున ధోనీ నాయకత్వంలో జడేజా రాటుదేలాడు.
ధోనీ నాయకత్వంలోనే అరంగేట్రం..
ధోనీ సారథ్యంలోనే టీమ్‌ఇండియాలోకి రవీంద్ర జడేజా అరంగేట్రం చేశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన జడేజా అనతికాలంలోనే ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. లోయర్‌ఆర్డర్‌లో ఎన్నోసార్లు విలువైన ఇన్నింగ్స్‌లను ఆడాడు. ఇటు ఐపీఎల్‌లోనూ తొలి నుంచీ ధోనీ నాయకత్వంలోనే ఆడటం విశేషం. జడేజా బ్యాటింగ్ ఆర్డర్‌ను మారుస్తూ అతడిలోని టాలెంట్‌ను ధోనీ బయటకు తెచ్చాడు. ఎలాంటి కఠిన పరిస్థితులైనా ఎదుర్కొని మ్యాచ్‌లను మలుపు తిప్పే సామర్థ్యం సొంతం చేసుకున్నాడు. కీలక సమయాల్లో వికెట్లను తీస్తూ ధోనీ మనసును గెలుచుకున్న జడేజా సీఎస్‌కే జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషించాడు. గత సీజన్‌లోనూ సీఎస్‌కే టైటిల్‌ను నెగ్గడంలో జడేజానే కీలకం. బ్యాటింగ్‌లో 16 మ్యాచులకుగాను 12 ఇన్నింగ్స్‌ల్లో 227 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 13 వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. అందుకే సీఎస్‌కే ఎంఎస్ ధోనీ కంటే భారీ మొత్తం ఇచ్చి మరీ రిటెయిన్ చేసుకుంది.
విరాట్‌కు మార్గం చూపాడు..
దాదాపు పదేళ్ల నుంచి (2012) చెన్నై జట్టుతోపాటు జడేజా ఉంటున్నాడు. మధ్యలో రెండేళ్లపాటు సీఎస్‌కేపై బ్యాన్ పడటం వల్ల రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ జట్టు తరఫున ఆడాడు. ఆర్‌పీఎస్‌జీకి ఎంఎస్ ధోనీ, స్టీవ్ స్మిత్ సారథులుగా వ్యవహరించారు. బ్యాటింగ్, బౌలింగ్ సహా ఫీల్డింగ్‌లోనూ చురుగ్గా ఉండే రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం వెనుక 'మిస్టర్ కూల్' ధోనీ మాస్టర్‌ప్లాన్ ఉందంటున్నారు విశ్లేషకులు. టీమ్‌ఇండియా సారథిగా వైదొలిగే సమయంలోనూ విరాట్ కోహ్లీని ఇదేవిధంగా సిద్ధం చేసి మరీ ధోని నిష్క్రమించాడు. అందుకే విరాట్ ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కఠిన సవాళ్లను ఎదుర్కొని మరీ భారత జట్టును ముందుకు నడిపించాడు. అతడి హయాంలో ఐసీసీ టైటిల్‌ను నెగ్గలేదనే కారణం తప్పించి.. ఇటు టెస్టులు, వన్డేలు సహా పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు గర్వించదగిన విజయాలను అందించాడు.