ఓ క్రికెటర్ తనను తాను నిరూపించుకునేందుకు సరైన వేదిక టెస్టు ఫార్మాట్. క్రీజులో కుదురుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. వీలైనన్నీ ఎక్కువ బంతులు ఆడటానికి వీలుంటుంది. ఇందులో సింగిల్స్, డబుల్స్‌తోనే స్కోరు బోర్డు కదులుతుంది. అలాంటిది బంతిని స్టాండ్స్‌లోకి పంపడమంటే అరుదనే చెప్పాలి. కానీ, టెస్టుల్లోనూ తమదైన దూకుడును చూపించిన బ్యాట్స్‌మెన్ కొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో బంతిని స్టాండ్స్‌లోకి పంపి టెస్టులకు ఊపు తెచ్చిన వారెవరు? సుదీర్ఘ క్రికెట్లో వారు కొట్టిన సిక్స్‌లు ఎన్ని? ఇలాంటి బ్యాట్స్‌మెన్ జాబితాను ఓ సారి తెలుసుకుందామా..
బ్రెండన్ మెక్కల్లమ్..
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కల్లమ్.. క్రీజులోకి దిగాడంటే చాలు ఫార్మాట్ ఏదైనా బౌండరీల మోత మోగాల్సిందే. టెస్టుల్లో అత్యధిక సిక్స్‌ల రికార్డూ ఈ కివీస్ క్రికెటర్ పేరు మీదే ఉంది. తన కెరీర్లో 101 టెస్టులు ఆడిన బ్రెండన్.. మొత్తం 107 సిక్స్‌లతో పాటు 776 ఫోర్లు బాదాడు. 64.6 స్ట్రైక్ రేట్, 38.64 సగటుతో సుదీర్ఘ ఫార్మాట్లో 6453 పరుగులు సాధించాడు. ఇందులో 12 శతకాలతో పాటు 31 అర్ధ శతకాలు ఉన్నాయి. తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన ఫీట్ కూడా ఇతడి పేరు మీదనే ఉంది.
ఆడమ్ గిల్‌క్రిస్ట్..
ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. మొత్తం 137 ఇన్నింగ్స్‌ల్లో 100 బంతులను స్టాండ్స్‌లోకి పంపాడు. వీటితో పాటు 677 బౌండరీలు బాదాడు. ఈ ఫార్మాట్లో 81.95 స్ట్రైక్ రేట్, 47.60 సగటుతో మొత్తంగా 5570 పరుగులు చేశాడు గిల్‌క్రిస్ట్. ఇందులో 17 శతకాలతో పాటు 26 అర్ధశతకాలు ఉన్నాయి. టెస్టుల్లో ఇతడి అత్యధిక స్కోరు 204*.
ఇదీ చదవండి:'జడేజా అసలైన 3డీ ప్లేయర్.. ఎందుకంటే?'