తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో 'సూ..పర్​' మచ్చి.. మునివేళ్లపై నిలబెట్టిన మ్యాచ్​లివే - bumra super over news

IPL SUPER OVERS: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక టీ20ల్లోనైతే క్షణాల్లో ఫలితాలు తారుమారవుతాయి. కొన్ని మ్యాచ్‌లు ఆఖరిబంతి వరకూ ఉత్కంఠను రేకెత్తిస్తే.. మరికొన్ని టైగా మారి సూపర్‌ ఓవర్‌కు దారి తీస్తాయి. దీంతో అభిమానులకు అసలు సిసలైన పొట్టి క్రికెట్‌ మజాని అందిస్తాయి. అలా ఐపీఎల్‌లో ఇప్పటివరకూ జరిగిన సూపర్‌ఓవర్లలో ఆకట్టుకున్నవేంటో ఓ సారి చూద్దాం..

IPL 2022
ఐపీఎల్​ 2022

By

Published : Mar 21, 2022, 1:25 PM IST

IPL SUPER OVERS: టీ20 క్రికెట్‌ అంటేనే రసవత్తర పోరాటాలకు చిరునామా. అలాంటిది ఇక ఐపీఎల్‌లో ఆ మజా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చివరి బంతి వరకూ సాగే మ్యాచులు.. సూపర్​ ఓవర్​లోనూ తేలని ఫలితాలు..ఎన్నో ఉన్నాయి. ఇలా సూపర్​ ఓవర్​కు దారితీసి అభిమానులకు అసలైన టీ20 మజాని అందించిన కొన్ని మ్యాచుల గురించి తెలుసుకుందాం.

ఇది డబుల్‌ సూపర్‌..

కేఎల్ రాహుల్​

2020 ఐపీఎల్‌ సీజన్‌లో ముంబయి, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన 36వ లీగ్‌ మ్యాచ్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠమైన మ్యాచ్‌గా నిలిచింది. ఎందుకంటే ఇందులో రెండుసార్లు సూపర్‌ ఓవర్లు జరిగాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 176/6 స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ డికాక్‌ (53) అర్ధ శతకంతో రాణించాడు. ఛేదనలో పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (77) దంచికొట్టాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ సైతం తలా ఓ చేయి వేయడంతో 20 ఓవర్లకు అంతే స్కోర్‌ చేసింది. దీంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. అక్కడ కూడా ఇరు జట్లూ 5 పరుగుల చొప్పునే చేయడం వల్ల ఉత్కంఠ మరోసారి తార స్థాయికి చేరింది. దీంతో మళ్లీ ఇంకో సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఈసారి ముంబయి 11 పరుగులు చేయగా ఛేదనలో క్రిస్‌ గేల్‌, మయాంక్‌ అగర్వాల్‌ బౌండరీలతో విరుచుకుపడి పంజాబ్‌ను గెలిపించారు.

అప్పుడూ సూపర్‌ ఓవర్‌ టై.. కానీ..

అజింక్యా రహానె

2014 ఐపీఎల్‌ సీజన్‌లోనూ మరో ఆసక్తికరమైన సూపర్‌ ఓవర్‌ జరిగింది. అప్పుడు కోల్‌కతా, రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన 19వ లీగ్‌ మ్యాచ్‌లో కూడా సూపర్‌ ఓవర్‌లో స్కోర్లు సమంగా మారాయి. అప్పటికి ఒకటి కంటే ఎక్కువ సూపర్‌ ఓవర్లు నిర్వహించే నియమాలు లేకపోవడం వల్ల బౌండరీ కౌంట్‌ ఆధారంగా విజేతను ప్రకటించారు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 152/5 స్కోర్‌ చేసింది. రహానె (72) ధాటిగా ఆడాడు. ఇక ఛేదనలో కోల్‌కతా 8 వికెట్లు కోల్పోయి అంతే స్కోర్‌ సాధించింది. దీంతో సూపర్‌ ఓవర్‌ నిర్వహించగా కోల్‌కతా 11/2 స్కోర్‌ చేసింది. ఆపై ఛేదనలో స్మిత్‌, షేన్‌ వాట్సన్‌ ఐదు బంతుల్లో 9 పరుగులు చేశారు. చివరి బంతికి 3 పరుగులు అవసరమైన స్థితిలో స్మిత్‌ బౌండరీకి ప్రయత్నించకుండా రెండు పరుగులే చేశాడు. మ్యాచ్‌ మళ్లీ టైగా మారినా ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఎక్కువ బౌండరీలు సాధించడంతో దాన్నే విజేతగా ఎంపిక చేశారు.

బుమ్రా మేటి బౌలింగ్‌తో..

జస్ప్రీత్​ బుమ్రా

ఐపీఎల్‌లో మరో ఆసక్తికరమైన సూపర్‌ ఓవర్‌లోనూ ముంబయి పాలుపంచుకోవడం గమనార్హం. అయితే, ఈసారి బుమ్రా మేటి బౌలింగ్‌తో ఆ జట్టు విజయం సాధించింది. ఇది 2017లో గుజరాత్‌ లైయన్స్‌తో జరిగిన 35వ లీగ్‌ మ్యాచ్‌లో చోటుచేసుకుంది. అప్పుడు గుజరాత్ తొలుత బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేయగా.. ఛేదనలో పార్థివ్‌ పటేల్‌ (70) మెరిసినా ఇతర ముంబయి బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. చివరికి ఆ జట్టు 20 ఓవర్లకు 153 పరుగులు చేసి ఆలౌటైంది. మ్యాచ్‌ టైగా మారి సూపర్‌ ఓవర్‌కు వెళ్లగా ముంబయి 11/2 స్కోర్‌ చేసింది. ఇక ఫించ్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌ బరిలోకి దిగడంతో ఆ జట్టు విజయం సాధిస్తుందని అనిపించింది. కానీ, బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా కేవలం 6 పరుగులే ఇచ్చాడు. దీంతో ముంబయి ఓటమిపాలయ్యే స్థితి నుంచి మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

మ్యాచ్‌లో తక్కువ.. సూపర్‌లో ఎక్కువ..

విరాట్​ కోహ్లీ

ఇక 2013 ఐపీఎల్‌ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్ల మధ్య మరో రసవత్తర పోరు జరిగింది. ఆ ఏడో లీగ్‌ మ్యాచ్‌లో ఇరు జట్లూ తక్కువ స్కోర్లే నమోదు చేసినా సూపర్‌ ఓవర్‌లో దంచికొట్టాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 130/8 నామమాత్రం స్కోర్‌ సాధించింది. విరాట్‌ కోహ్లీ (46) టాప్‌ స్కోరర్‌. సన్‌రైజర్స్‌ ఛేదనలో హనుమ విహారి (44) రాణించినా మిగతా బ్యాట్స్‌మెన్‌ తేలిపోయారు. దీంతో చివరికి ఆ జట్టు కూడా 130/7 స్కోర్‌ చేసింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు వెళ్లగా సన్‌రైజర్స్ బ్యాట్స్‌మన్‌ కామరూన్‌ వైట్‌ రెండు సిక్సర్లు దంచికొట్టాడు. దీంతో 20 పరుగులు సాధించింది. అనంతరం బెంగళూరు జట్టులో కోహ్లీ ఒక ఫోర్‌, గేల్‌ ఒక సిక్సర్‌ బాదినా ఆ జట్టు 15 పరుగులే చేసి ఓటమిపాలైంది.

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన చెన్నై..

యువరాజ్​ సింగ్​

2010లో చెన్నై సూపర్‌ కింగ్స్, కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ 16వ లీగ్ మ్యాచ్‌లో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 136/8 స్వల్ప స్కోరే సాధించింది. ఛేదనలో చెన్నై 12.3 ఓవర్లకు 96/2తో విజయంవైపు దూసుకెళ్తోంది. అయితే, ఒక్కసారిగా చెలరేగిన పంజాబ్‌ బౌలర్లు తర్వాత చెన్నైని దెబ్బకొట్టారు. దీంతో 97/3 నుంచి 20 ఓవర్లకు 136/7కి కట్టడి చేసి మ్యాచ్‌ను టైగా ముగించారు. తర్వాత సూపర్‌ ఓవర్‌లో బ్యాటింగ్‌ చేసిన చెన్నై 10 పరుగులే చేసింది. తర్వాత జయవర్దెనె, యువరాజ్‌ దంచికొట్టి పంజాబ్‌ను గెలిపించారు.

ఇదీ చదవండి:ఊరిస్తున్న టీమ్ఇండియా కెప్టెన్సీ.. ఐపీఎల్​లో రాణిస్తారా?

ABOUT THE AUTHOR

...view details