తెలంగాణ

telangana

ETV Bharat / sports

కెరీర్​ ముగిసింది అనుకున్న వేళ - కష్టాలనే అవకాశాలుగా మలుచుకుని - షమీ కెరీర్​లో ఎన్నో మలుపులు!

Mohammed Shami World Cup 2023 : వన్డే ప్రపంచకప్​లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమ్ఇండియా.. న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్​లో చెలరేగి ఫైనల్స్​కు చేరుకుంది. హోరా హోరీగా జరిగిన మ్యాచ్​లో ఒకానొక దశలో ఇక భారత్​కు ఓటమి తప్పదన్నట్లుగా అనిపించింది. కానీ అప్పుడే రంగంలోకి దిగిన మహ్మద్​ షమీ తనదైన శైలిలో బంతులను విసిరి ప్రత్యర్థులను బెంబెలెత్తించాడు. కీలకమైన వికెట్లు తీసి జట్టును విజయ పథంలో నడిపించాడు. దీంతో షమీ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. అయితే జట్టుకు కీలక విజయాన్ని అందించిన ఈ స్టార్ ప్లేయర్​.. తన కెరీర్​లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ఒ సారి అతడి కెరీర్​ను చూస్తే..

Mohammed Shami World Cup 2023
Mohammed Shami World Cup 2023

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 8:40 AM IST

Mohammed Shami World Cup 2023 :గృహ హింస కేసులు, ఫిక్సింగ్‌ ఆరోపణలు.. ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. ఇవేమీ మహమ్మద్‌ షమీని కుంగదీయలేదు. 2013లోనే కెరీర్‌ ప్రారంభించిన ఈ స్టార్​ ప్లేయర్​.. తన కెరీర్​లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. తొలినాళ్లలో ఓ ఆటగాడిగా అతడికి దక్కాల్సిన గుర్తింపు లభించలేదు. జహీర్‌ ఖాన్‌.. ఇషాంత్‌ శర్మ లాంటి దిగ్గజాలు అప్పటికే జట్టులో ఉన్నందున ప్రతిభ ఉన్నప్పటికీ.. వారి చాటున ఉండిపోయాడు. ఆ తర్వాత బుమ్రా రావడం వల్ల మరో సారి అతడి నీడలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక శాతం (33%) వికెట్లు క్లీన్‌ బౌల్డ్‌లుగా సాధించిన ఆటగాడిగా రికార్డుకెక్కినప్పటికీ షమీ ఇంకా వెనకనే ఉండిపోయాడు. దీంతో అతడి కెరీర్‌ ఒక దశలో ముగిసి పోయిందనుకొన్నారు.. కానీ, బౌన్సింగ్‌ పిచ్‌ను తాకిన బంతిలా ఎగిరాడు. జట్టులో కీలకంగా మారాడు.

ఆ ఐదేళ్ల కష్టకాలం.. 11 ఏళ్ల కెరీర్​లో ఎన్నో మలుపులు
గాయాలు, కుటంబ వివాదాలు ఇలా తన 11 ఏళ్ల కెరీర్‌లోని ఐదేళ్లు గడిచిపోయాయి. దీంతో అతను 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2018లో అతడి జీవితంలో ఓ పెనుతుపానే వచ్చింది. భార్య పెట్టిన గృహ హింస కేసు, ఫిక్సింగ్‌ ఆరోపణలు అతడిని కుంగదీశాయి. ఇక అదే ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్‌ కూడా నిలిచిపోయింది. వాటన్నింటినీ అధిగమించడానికి షమీ ఎంతో ప్రయత్నించాడు. ఈ పరిణామాలను గుర్తుచేసుకుంటూ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ ఒక్కసారిగా విలపించాడు. అయితే ఆ తర్వాత ఫిక్సింగ్‌ ఆరోపణల నుంచి బయటపడ్డాడు.

మరోవైపు ఐపీఎల్‌లో దిల్లీ డేర్‌ డెవిల్స్‌ కూడా ఎన్నో ఏళ్లుగా ఆడుతున్న షమీని 2019 సీజన్‌కు ముందు వదులుకుంది. కానీ, షమీ ఏ మాత్రం నిరాశ చెందలేదు. 2019లో 21 వన్డేల్లో ఏకంగా 177.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి.. అత్యధికంగా 42 వికెట్లు సాధించి చరిత్రకెక్కాడు.

ఆస్ట్రేలియా సిరీస్​ నుంచి డ్రాప్​.. సొంత మైదానంలో సాధన
2020లో ఆస్ట్రేలియా సిరీస్‌లో వివిధ కారణాల వల్ల షమీ జట్టు నుంచి డ్రాప్‌ చేశారు. అప్పటి నుంచి 2022 వరకు జట్టు నుంచి పిలుపు రాలేదు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహ గ్రామీణ ప్రాంతంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో తన సొంత డబ్బుతో ఓ మైదానాన్ని ఏర్పాటు చేసుకుని సాధన చేశాడు. ఆ ఈ పిచ్‌ పనులను షమీతో పాటు అతడి సోదరుడు మహమ్మద్‌ కైఫ్‌ చేసుకునేవారు. లాక్‌డౌన్‌ సమయంలో యూపీ సీమర్‌ మొహసీన్‌ ఖాన్‌తో కలిసి షమీ తన సొంత మైదానంలో సాధన చేశాడు. అప్పట్లో అతి తక్కువ మంది మాత్రమే అతడితో కలిసి సాధన చేసేవారు. అంతేకాదు.. మొహసీన్‌ ఖాన్‌ పురోగతిని కూడా స్వయంగా షమీ సమీక్షించేవాడు.

ఇక ఫిట్​నెస్​ కోసం షమీ.. ఇంట్లోనే ఒక మినీ జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు.. తన పొలంలోని మట్టిపై చాలా సేపు రన్నింగ్‌ చేసేవాడు. ఇదంతా షమీకి అక్కరకొచ్చింది. ఇక లాక్‌డౌన్‌ తర్వాత గుజరాత్‌ టైటాన్స్ తరపున ఆడిన షమీ.. ఆడిన అన్ని మ్యాచుల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. అలా మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. కానీ వరల్డ్​ కప్​ లీగ్‌ దశలోని తొలి నాలుగు మ్యాచ్‌లకు షమీని తుది జట్టులోకి తీసుకోలేదు. హార్దిక్‌ గాయం కారణం వల్ల జట్టులోకి వచ్చిన షమీ.. తొలి మ్యాచ్‌లోనే తన పటిష్ఠమైన బౌలింగ్​తో న్యూజిలాండ్‌ బ్యాటర్లకు చెమటలు పట్టించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అప్పటి నుంచి అతడు వెనక్కి చూసుకోలేదు. ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఏకంగా 7 వికెట్లు తీసి భారత బౌలింగ్‌ దళం రారాజుగా నిలిచాడు. ఈ స్టార్ ప్లేయర్​ బౌలింగ్ చూసిన ఫ్యాన్స్.. రానున్న ఫైనల్స్​లోనూ అతడు ఇదే జోరును కనబర్చాలని క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

Shami World Cup Wickets : సూపర్​ ఫామ్​లో షమీ.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో..

షమీ అరుదైన ఘనత​, ఆ ఇద్దరు దిగ్గజాల రికార్డ్ బద్దలు

ABOUT THE AUTHOR

...view details