Mohammed Shami react on Trolls: గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో టీమ్‌ఇండియా ఓటమిపాలైన తర్వాత స్టార్ పేసర్ మహ్మద్ షమి సోషల్మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే, తొలిసారి దానిపై స్పందించిన అతడు.. తనను విమర్శించిన వారు అసలు అభిమానులే కాదని, వాళ్లు నిజమైన భారతీయులు కూడా కాదని చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. తనపై వచ్చిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోనని అన్నాడు. ఒక ఆటగాడిగా తానేంటో తనకు తెలుసని చెప్పాడు.
"సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులు లేదా అతి తక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వాళ్లు.. ఇతరులపై విమర్శలు చేస్తే మాకు పోయేదేమీ లేదు. అలాంటి వారిని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేమేంటో మాకు తెలుసు. మాకు దేశం అంటే ఎంత గొప్పో తెలియజేయాల్సిన అవసరం లేదు. మేం దేశాన్ని గౌరవిస్తాం. దేశం కోసమే పోరాడతాం. అలాంటప్పుడు ఆ విమర్శలకు స్పందించి లేదా వారికి సమాధానం ఇచ్చి మా అంకితభావాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు"