తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే ఎవరు కాదంటారు'

Mohammed Shami on Captaincy: టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్​ కోహ్లీ తప్పుకున్న తర్వాత టీమ్​ఇండియా సారథి ఎవరు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాడు మహ్మద్ షమి కీలక వ్యాఖ్యలు చేశాడు.

shami
షమి

By

Published : Jan 27, 2022, 6:17 PM IST

Mohammed Shami on Captaincy: ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్‌ఇండియా టెస్టు సారథ్య బాధ్యతల గురించి ఆలోచించడం లేదని.. అయితే, తనకు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రధాన పేసర్‌ మహ్మద్‌ షమి పేర్కొన్నాడు. ఇటీవలే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో టెస్టు కెప్టెన్సీపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ఇప్పటికే రోహిత్‌ పరిమిత ఓవర్లలో రెండు ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. టెస్టుల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వైస్‌ కెప్టెన్‌గానూ నియమితుడయ్యాడు. కాగా, అతడు గాయం కారణంగా ఆ పర్యటనకు దూరం కావడంతో కేఎల్‌ రాహుల్‌ వన్డేల్లో కెప్టెన్సీ చేపట్టాడు. అలాగే కోహ్లీ ఆడలేకపోయిన రెండో టెస్టులోనూ సారథ్య బాధ్యతలు నిర్వర్తించాడు. దీంతో వీరిద్దరిలోనే ఎవరో ఒకరు టెస్టు పగ్గాలు అందుకొంటారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఇద్దరు సీనియర్‌ బౌలర్ల పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. వారే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి. వీరిద్దరూ మూడు ఫార్మాట్లలో కొనసాగుతుండటంతో టెస్టు కెప్టెన్సీ రేసులో ఉండే అవకాశం లేకపోలేదు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన షమి.. తాను ఇప్పుడు కెప్టెన్సీ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. నిజం చెప్పాలంటే టీమ్‌ఇండియాకు కెప్టెన్సీ చేపట్టే అద్భుత అవకాశం వస్తే ఎవరు మాత్రం కాదంటారన్నాడు. అయితే, తాను కెప్టెన్సీ గురించి మాత్రమే కాకుండా జట్టుకు ఏ విధంగా ఉపయోగపడాలన్న దానిపై సిద్ధంగా ఉన్నానన్నాడు. కాగా, షమి ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టుల్లో ఆడగా తర్వాత వన్డేల్లో విశ్రాంతి తీసుకున్నాడు. ఇక వచ్చేనెల వెస్టిండీస్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సైతం జట్టు యాజమాన్యం విశ్రాంతి కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details