Mohammed Shami Brother :వరల్డ్ కప్‌లో అత్యుత్తమ ఫామ్ కనబరిచి అందరికీ హీరోగా మారిపోయాడు టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ షమీ. భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్లేయర్ ఆట తీరును అందరూ కొనియాడారు. అయితే సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు గాయం కారణంగా అతడు దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షమీ బాటలోనే అతడి కుటుంబం నుంచి మరో పేసర్ మైదానంలోకి దిగుతున్నాడు. అన్నకు తగ్గ తమ్ముడిగా పేరు తెచ్చుకుంటూ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. బెంగాల్ తరపున రంజీ అరంగేట్రం చేసిన ఈ యువ కెరటం మరెవరో కాదు. షమీ సోదరుడు కైఫ్.
షమీ లాగే కైఫ్‌కు కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఎంతో మక్కువ. తనకంటే ఆరేళ్ల పెద్దవాడైన షమీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో సాగుతుండటం చూసిన కైఫ్ స్ఫూర్తి పొందాడు. అలా టీమ్‌ఇండియాకు ఆడాలనే లక్ష్యంతో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. స్పీడ్, సీమ్, స్వింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నాడు.
ఇక కైఫ్ ఇప్పటివరకూ తొమ్మిది లిస్ట్- ఎ మ్యాచ్‌ల్లో 26.33 సగటుతో 12 వికెట్లు పడగొట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో పుట్టిన ఈ స్టార్ ప్లేయర్ 2021లో జమ్ము కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌తో బెంగాల్ తరఫున లిస్ట్- ఎ తో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి తన ఖాతాలో వేసుకున్నాడు. గోవాపై మూడు వికెట్లను సాధించాడు. బరోడా, తమిళనాడు, పంజాబ్, హరియాణాపై కూడా రెండు వికెట్ల చొప్పున పడగొట్టాడు.