అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్ - మిథాలీ రాజ్ వార్తలు
14:22 June 08
అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మిథాలీ రాజ్
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళల క్రికెట్‌ను తీర్చిదిద్దడంలో కృషిచేశానని, ఇన్నాళ్లూ తనపై చూపిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు (10,686) ఆమెదే. 232 వన్డే మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 7805 పరుగులు చేశారు. 7వేల పరుగులు సాధించిన మైలు రాయిని అధిగమించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీనే కావడం విశేషం. వన్డేల్లో 7 శతకాలు 64 అర్ధ శతకాలు చేసిన మిథాలీ.. టీ20 మ్యాచ్‌ల్లోనూ అదరగొట్టారు. టీ20ల్లో 17 అర్ధశతకాలు నమోదు చేశారు. 89 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తంగా 2,364 పరుగులు సాధించారు.
39 ఏళ్ల మిథాలీ జీవితంలో 30 సంవత్సరాలు క్రికెట్టే. తొమ్మిదేళ్ల వయసులో ఆటలో అడుగుపెట్టిన ఆమె ప్రపంచ మహిళల క్రికెట్లో తన సత్తా చాటారు. మిథాలీ రాజ్ జీవితం వర్ధమాన క్రికెటర్లకు ఎంతో ఆదర్శం. తన 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు.. మరెన్నో రికార్డులు ఆమె సొంతం చేసుకున్నారు. మహిళల క్రికెట్లో ఇంకెవరికీ సాధ్యంకాని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సుమారు 30 ఏళ్లుగా ఫిట్‌నెస్ కాపాడుకుంటూ.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా కెరీర్ కొనసాగిస్తూ వచ్చారు.
ఇదీ చూడండి :కోహ్లీ సూపర్ రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా