తెలంగాణ

telangana

ETV Bharat / sports

Mithali Raj: మహిళల క్రికెట్​లో మరో సచిన్​

ఆమె క్రికెట్లోకి అడుగు పెట్టే సమయానికి ఇప్పుడు భారత జట్టులో స్టార్లుగా ఉన్న షెఫాలీవర్మ, జెమిమా రోడ్రిగ్స్ లాంటి వాళ్లు పుట్టనే లేదు.. ఆమె రికార్డులు కొట్టే సమయానికి స్మృతి మంధాన లాంటి వాళ్లు బ్యాట్ పట్టనే లేదు. 22 ఏళ్లు.. ఎన్నో రికార్డులు.. మరెన్నో ఘనతలు! ఇప్పటికీ యువ బ్యాటర్లతో పోటీపడుతూ పరుగులు! ఈ ఉపోద్ఘాతం మిథాలీ రాజ్ గురించే అని ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. తాజాగా ఇంగ్లాండ్​తో మూడో వన్డే సందర్భంగా అన్ని ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ఈ హైదరాబాదీ అమ్మాయి మరో ఘనత సొంతం చేసుకుంది. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ సాగిన 22 ఏళ్ల ఆమె ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

mithali raj, team india captain
మిథాలీ రాజ్, టీమ్ఇండియా మహిళల కెప్టెన్

By

Published : Jul 5, 2021, 7:06 AM IST

ఎప్పుడో 1996లో ఐర్లాండ్​పై 16 ఏళ్ల వయసులో వన్డే అరంగేట్రం చేసిన మిథాలీ తొలి మ్యాచ్​లోనే అజేయంగా 114 పరుగులు చేసి తన రాకను ఘనంగా చాటుకుంది. ఆ తర్వాత ఆమె వేగంగా ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లింది. మహిళల క్రికెట్లో ఆడే అంతర్జాతీయ మ్యాచ్​లు తక్కువే అయినా.. ఎప్పుడు అవకాశం దొరికినా ఈ కుడి చేతివాటం బ్యాట్స్​మన్ సత్తా దాటింది. సాంకేతికంగా బలంగా ఉండడం, సహనంతో ఆవడం మిథాలీని పరుగుల యంత్రంగా మార్చింది. 2002లో ఆడిన మూడో టెస్టులోనే (ఇంగ్లాండ్​పై) 214 పరుగులు చేసి కరెన్ రోల్టాన్ పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును బద్దలుకొట్టింది. టెస్టులు(11) తక్కువే ఆడినా.. వన్డేల్లో (217) మిథాలీ ఎప్పుడూ నమ్ముకోదగ్గ బ్యాటర్​గా మారింది. భారత విజయాల్లో ఆమెదే కీలకపాత్ర.

బ్యాటర్​గానే కాదు కెప్టెన్​గానూ మిథాలీ జట్టును ముందుండి నడిపిస్తోంది. 2017 వన్డే ప్రపంచకప్​లో జట్టు ఫైనల్ చేరడంలో ఆమెది ప్రముఖ పాత్ర. సారథిగానే కాక బ్యాటర్​గా వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసింది. 206 పరుగులు సాధించి టోర్నీలో అత్యధిక స్కోరర్​గా నిలిచింది. కేవలం క్రికెటర్​గానే కాక జట్టులో యువ క్రీడాకారిణులకు పెద్ద దిక్కుగా మిథాలీ ఇప్పుడు భిన్న పాత్రలను పోషిస్తోంది. ఇప్పుడు ఆమె లక్ష్యం ఒక్కటే 2022 వన్డే ప్రపంచకప్​లో సత్తా చాటి జట్టుకు కప్​ అందించడం.

ఇదీ చదవండి:మహిళలపై అనుచిత వ్యాఖ్యలు- క్రికెటర్​ క్షమాపణ

సవాళ్లను దాటి..

22 ఏళ్ల కెరీర్.! పురుషుల క్రికెట్లో కూడా ఇది అంత తేలిక కాదు. అలాంటిది మహిళల క్రికెట్లో ఇంత కాలం కెరీర్ కొనసాగించడం అంటే పెద్ద ఘనతే! ఈ 22 ఏళ్లలో ఎన్నో అడ్డంకులను అధిగమించి మిథాలీ ఇక్కడిదాకా వచ్చింది. ఆమె కెరీర్ ఆరంభం నుంచే మ్యాచ్ ఫీజులు అంతంతమాత్రం, ప్రయాణ ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆర్థికంగా ఏమాత్రం లాభదాయకం కాకున్నా, మహిళల క్రికెట్​కు ప్రోత్సాహం అంతంతమాత్రమే అయినా అవేవీ ఆమెకు అడ్డంకులు కాలేకపోయాయి. కెరీర్ ఆరంభం నుంచి అదే అంకితభావంతో తన ఆట తాను ఆడుతూ ముందుకు సాగింది. చిన్న వయసులోనే జట్టుకు కెప్టెన్ కూడా అయింది.

మహిళల క్రికెట్ బీసీసీఐలోకి వచ్చే వరకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఆమె కెరీర్​ను కొనసాగించింది. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ తర్వాత, రెండేళ్ల కిందట టీ20 ప్రపంచకప్​ సమయంలో ఆమె సామర్థ్యంపై, అంకితభావంపై జట్టు యాజమాన్యం నుంచే ప్రశ్నలు తలెత్తినా ఆమె కుంగిపోలేదు. ఆటతోనే అన్నింటికీ సమాధానం చెప్పింది. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్​నే తీసుకుంటే.. మూడు మ్యాచ్​ల్లోనూ మిగతా ప్రధాన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. కానీ మిథాలీ మూడు మ్యాచ్​ల్లోనూ పోరాట స్ఫూర్తితో ఆర్ధశతకాలు సాధించింది. ముఖ్యంగా చివరి మ్యాచ్​లో కడదాకా నిలిచి జట్టును గెలిపించిన వైనం అద్భుతం. ఈ క్రమంలోనే మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులతో ప్రపంచ రికార్డునూ బద్దలు కొట్టింది.

ఇదీ చదవండి:Dhoni: భార్యకు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​.. ఏంటంటే?

దాహం ఇంకా తీరలేదు..

మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్​గా నిలిచినా తన దాహం ఇంకా తీరలేదని మిథాలీ రాజ్ చెప్పింది. "నా కెరీర్​ ఆసాంతం ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. సవాళ్లను ఎదుర్కొన్నాను. కొన్ని సందర్భాల్లో క్రికెట్​కు వీడ్కోలు చెబుదాం అనుకున్నా. కానీ అలా అనుకుంటూనే 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించా. మహిళల క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక స్కోరర్​గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. నా పరుగుల దాహం ఇంకా తీరలేదు. బరిలోకి దిగి భారత్​కు మ్యాచ్​లు గెలిపించాలనే తపన ఇంకా అలాగే ఉంది. నా బ్యాటింగ్​లో ఇంకా మెరుగుపడాల్సిన అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. జట్టులో నా బ్యాటింగ్ పాత్రకు తగ్గట్టుగా ఉంటుంది. యువ క్రికెటర్లకు మార్గనిర్దేశం చేస్తూ సాగుతుంది. ఛేదన చేస్తున్నప్పుడు నాకు స్కోరింగ్ విషయంలో స్పష్టత ఉంటుంది. మిగిలిన బ్యాటర్లతో కలిసి ఎలా ఆడాలో తెలుస్తుంది. నా గురించి ఇప్పుడు ప్రత్వేకంగా నిరూపించుకోవాల్సింది ఏమి లేదు. నా స్ట్రయిట్​రేట్​ గురించి విమర్శలను నేనూ విన్నా. సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఇప్పుడు కొత్తగా జనాల ఆమోద ముద్ర అవసరం లేదు" అని మిథాలీ చెప్పింది. 2019లో టీ20ల నుంచి రిటైర్ అయిన మీథాలీకి 2022 ప్రపంచకప్పే ఆఖరిదిగా భావిస్తున్నారు.

మిథాలీ ఘనతలు..

  • 1999లో ఐర్లాండ్​పై వన్డే అరంగేట్రంలో అజేయ సెంచరీ(114 నాటౌట్) చేసింది.
  • 2005లో దిల్లీలో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో అంజూ జైన్​ (2170)ను దాటి మహిళల క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా ఘనత వహించింది.
  • 2017లో ఆస్ట్రేలియాలో బ్రిస్టల్​లో జరిగిన వన్డేలో 6000 పరుగుల మైలురాయిని దాటింది. వన్డేల్లో ఈ ఘనత అందుకున్న తొలి బ్యాటర్​ మిథాలీనే కావడం విశేషం.
  • 2021లో ఇంగ్లాండ్​తో మూడో వన్డేలో చార్లెట్​ ఎడ్వర్డ్స్​(10273) అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డును మిథాలీ(10337) అధిగమించింది.

ఇదీ చదవండి:Smriti Mandhana: పెళ్లిపై స్మృతి మంధాన.. ట్వీట్ వైరల్!

ఆ రికార్డులు నిలిచిపోతాయి: శాంత

మీథాలీ రాజ్ సృష్టించిన రికార్డులు ఎక్కువకాలం నిలిచి ఉంటాయని భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి చెప్పింది. "సునీల్​ గావస్కర్, సచిన్ తెందుల్కర్ లాంటి దిగ్గజాలతో పోల్చేలా మిథాలీ అరుదైన రికార్డులు సృష్టించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైన పరుగులు సాధించడం లాంటి రికార్డులు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఇప్పట్లో మిథాలీ రికార్డులు బద్దలవుతాయని అనుకోవట్లేదు" అని శాంత తెలిపింది.

ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో వరుసగా మూడు అర్ధసెంచరీలు చేయడం ద్వారా మిథాలీ తన క్లాస్​ను మరోసారి ప్రదర్శించిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ లీసా స్తలేకర్ చెప్పింది. "ఎందుకు తాను క్రమం తప్పకుండా రికార్డులు బద్దలు కొడుతుందో మిథాలీ మరోసారి రుజువు చేసుకుంది. ఇంగ్లాండ్​తో వన్డే సిరీస్​లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేయడం ఆమె క్లాస్​కు నిదర్శనం. అన్నిటికంటే ముఖ్యంగా ఛేదనలో మిథాలీ గొప్పగా ఆడుతుంది. వన్డేల్లో లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఆమెకు 100కు పైగా సగటు ఉంది. ఆమె ఎప్పుడు ఇన్నింగ్స్​ ఆరంభంలో సాహసోపేతమైన షాట్లకు పోదు. లెక్క ప్రకారం ఆడుతూ పని పూర్తి చేస్తుంది. పరుగులు కూడగట్టడంలో ఆమె చాలా తెలివిగా వ్యవహరిస్తుంది" అని లీసా పేర్కొంది.

ఇదీ చదవండి:HCA ISSUE: మళ్లీ హెచ్​సీఏ అధ్యక్షుడిగా అజహరుద్దీన్​

ABOUT THE AUTHOR

...view details