Mitchell Starc IPL 2024 : రానున్న ఐపీఎల్ సీజన్ 17 కోసం గట్టి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవలే దుబాయ్ వేదికగా ఐపీఎల్ మినీ వేలం గ్రాండ్‌గా జరిగింది. దాదాపు 10 ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొని మినీ వేలంలో తమకు నచ్చిన ప్లేయర్లను ఎంచుకున్నాయి. అందులో భారత్‌తో పాటు మిగిలిన దేశాలకు చెందిన క్రికెట్లరను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. అయితే అందులో కొంత మంది స్టార్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాకు ప్లేయర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్ల ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఈ విషయంపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఓ విదేశీ ప్లేయర్‌ను ఇంత ధరకు ఎందుకు కొనుగోలు చేశారంటూ క్రికెట్ లవర్స్ ఆరా తీస్తున్నారు. మిచెల్ స్టార్క్ గత ఏడు సీజన్లలో ఐపీఎల్‌ల్లో అసలు ఆడనే లేదు. దీంతో అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి కనబరిచుంటాయంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. అయితే ఐపీఎల్లో ఇన్నేళ్లు ఎందుకు ఆడలేదన్న విషయం పైన స్టార్క్ తాజాగా స్పందించాడు.
"టెస్టు క్రికెట్‌కే నా మొదటి ప్రాధాన్యం. టెస్టులతో పాటు ఆస్ట్రేలియా తరఫున ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేందుకు నేను అధిక ప్రాధాన్యమిచ్చాను. ఇన్నాళ్లూ ఐపీఎల్లో ఆడనందుకు నేనేమీ చింతించలేదు. ఒక రకంగా చెప్పాలంటే నేను ఐపీఎల్ నుంచి దూరంగా ఉండటం వల్ల టెస్టులలో నా ఆట కూడా మెరుగుపడింది. ఈ విషయం నేను గతంలో ఒక సారి చెప్పాను. రెడ్ బాల్ క్రికెట్ నాకు ఎప్పుడూ ముఖ్యమే. రాబోయే ఏడాదిలో టీ20 వరల్డ్ కప్‌లో సిద్ధమయ్యేందుకు ఐపీఎల్ నాకు దోహదం చేస్తుందని నేను భావిస్తున్నాను" అంటూ స్టార్క్ అసలు విషయం చెప్పుకొచ్చాడు. మరోవైపు వేలంలో తనపై ఫ్రాంచైజీలు మక్కువ చూపిన తీరుకు ఆనందంగా ఉందని అందుకు కృతజ్ఞుడనంటూ తెలిపాడు. రానున్న సీజన్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు.