తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ వారసుడు జడేజానే: వాన్

చెన్నై సూపర్​ కింగ్స్​ సారథ్య బాధ్యతల నుంచి ధోనీ తప్పుకొన్నాక రవీంద్ర జడేజాను సారథిగా నియమించాలని అభిప్రాయపడ్డాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.​ బ్యాట్‌, బంతి, ఫీల్డింగ్‌తో పాటు అతడి ఆలోచనా విధానం కూడా బాగుంటుందని అన్నాడు. ఆటపై మంచి పరిజ్ఞానం కలిగిన ఆటగాడని కితాబిచ్చాడు.

Vaughan, jadeja
వాన్, జడేజా

By

Published : Apr 20, 2021, 9:55 PM IST

చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో మహేంద్రసింగ్‌ ధోనీ తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు అన్ని అర్హతలు ఉన్నాయని, ధోనీ వారసుడిగా అతడే సరైన ఆటగాడని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాటు ఆలోచనా విధానం కూడా బాగుంటుందని కొనియాడాడు. ఈ నేపథ్యంలోనే జడేజాను భవిష్యత్‌ కెప్టెన్‌గా భావిస్తూ చెన్నై సరైన ప్రణాళికలు రూపొందించుకోవాలని వాన్‌ సూచించాడు.

"ధోనీ మరో రెండు, మూడేళ్లు ఆడతాడని మీరు అనుకోవచ్చు. కానీ, నిజం చెప్పాలంటే ఆ తర్వాత క్రియాశీలక పాత్ర పోషించకపోవచ్చు. కాబట్టి ఇప్పటినుంచే చెన్నై.. తమ జట్టును ఎవరు నడిపించగలరనే విషయంపై దృష్టి సారించాలి. నేనైతే జడేజానే ఎంపిక చేస్తా. నా దృష్టిలో అతడే సీఎస్కేను ముందుండి నడిపిస్తాడు. బలమైన జట్టును నిర్మిస్తాడు. అలాగే బ్యాట్‌, బంతి, ఫీల్డింగ్‌తో పాటు అతడి ఆలోచనా విధానం కూడా బాగుంటుంది. ఆటపై మంచి పరిజ్ఞానం కలిగిన ఆటగాడతడు. అవసరాన్ని బట్టి ఎక్కడైనా బ్యాటింగ్‌ చేయగలడు, ఎప్పుడైనా బౌలింగ్ చేయగలడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఆటతీరును బట్టి ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేసుకోగల ఆటగాడు. అతడు అంత మంచి క్రికెటర్‌" అని వాన్‌ ప్రశంసలు కురిపించాడు.

సోమవారం సీఎస్కే.. వాఖండే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడి 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జడేజా (7) బ్యాట్‌తో నిరాశపర్చినా.. రెండు వికెట్లు తీశాడు. ధాటిగా ఆడుతున్న జాస్‌ బట్లర్‌(49)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అలాగే మనన్ వోహ్రా, రియాన్‌ పరాగ్, క్రిస్‌ మోరిస్‌, ఉనద్కత్‌ల క్యాచులను అందుకుని చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దీనిని ఉద్దేశిస్తూ పైవ్యాఖ్యలు చేశాడు వాన్​.

ABOUT THE AUTHOR

...view details