Maxwell Wife Vini Raman Slams Indian Fans :భారత క్రికెట్ అభిమానులపై.. ఆస్ట్రేలియా వరల్డ్ కప్ టీమ్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ భార్య విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్, భారత్‌ను ఓడించిన తర్వాత తనకు వచ్చిన విద్వేషపూరితమైన మెసేజ్‌లపై స్పందించిన రామన్.. ఉన్నతంగా ప్రవర్తించండి అంటూ హితవు పలికింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు పెట్టింది.
"ఉన్నతంగా ప్రవర్తించండి. నేను ఇలా చెబుతున్నానని నమ్మలేకపోతున్నాను. మీరు భారతీయులు అయి ఉండవచ్చు. కానీ మీరు పుట్టి పెరిగిన దేశాన్ని కూడా గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త టీమ్‌ను, మీ బిడ్డకు తండ్రిని. (తెలివితక్కువ వాళ్లు) ఒక చిల్ పిల్ వేసుకుని మీ ఆగ్రహాన్ని ప్రపంచ సమస్యలపై చూపించండి" అని విని రామన్ తీవ్రంగా స్పందించింది.
ఆదివారం టీమ్ఇండియా ఫైనల్లో ఓడిపోవడం వల్ల కోట్లాది మంది భారత అభిమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అయితే వినిరామన్ తల్లిదండ్రులు తమిళనాడుకు చెందిన వారు. విని ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగింది. ఆదివారం ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. ఆ దేశానికి సపోర్ట్ చేసింది. అయితే అందుకు భారత అభిమానులు ఆమెను ట్రోల్ చేయడం వల్ల.. విని రామన్ తిరిగి స్పందించింది. తాను ఆస్ట్రేలియాలో పుట్టిపెరిగినట్లు వివరించింది.