Maxwell Kapil Dev World Record : 2023 ప్రపంచకప్‌లో నవంబర్ 7న అస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. అఫ్గానిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. మ్యాక్స్‌వెల్, ప్రత్యర్థి చేతుల్లోంచి .. మ్యాచ్ లాగేసుకున్న తీరు అద్భుతం. ఇలాంటి ఇన్నింగ్స్ మెగాటోర్నీలో చాలా అరుదు. అయితే సరిగ్గా నలభైఏళ్ల కింద ఇలాంటి ఇన్నింగ్స్ ఒకటి నమోదైందని మీకు తెలుసా?
అది 1983 వరల్డ్‌కప్ టోర్నమెంట్. ఆ టోర్నీలో భారత్ జూన్ 18న జింబాబ్వేతో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడితే టోర్నీ నుంచి టీమ్ఇండియా నిష్ర్కమిస్తుంది. అలాంటి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనె ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు సునీల్ గావస్కర్ (0), శ్రీకాంత్ (0) డకౌటయ్యారు. జింబాబ్వే పేస్ ధాటికి భారత్.. 17 పరుగులకే సగం (5) వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమని అనుకున్నారంతా. కానీ, క్రీజులో ఉన్న అప్పటి టీమ్ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్.. ఆశలు వదులుకోలేదు. కపిల్, జింబాబ్వే బౌలర్లకు ఎదురొడ్డి.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు.
కపిల్ ఓ సైనికుడిలా పోరాడి ఒక్కడే 175 (138 బంతుల్లో : 16x4, 6x6) పరుగులు సాధించాడు. ఫలితంగా 17-5 స్థితిలో ఉన్న భారత్.. 266-8 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది. అనంతరం జింబాబ్వేను 235 పరుగులకు ఆలౌట్ చేసి.. భారత్ 31 పరుగులతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో కపిల్ దేవ్, ఇన్నింగ్స్ గురించి అప్పటి క్రికెట్ ప్రేమికులు ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. ఆరోజు కపిల్ పోరాటం అద్వితీయం అని ఇప్పటికీ ఆయడ్ని కొనియాడుతారు.