Matt Henry Injury :ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో మొదట వరుసగా 4 సార్లు గెలిచి.. ఆ తర్వాత వెంటవెంటనే హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకున్న న్యూజిలాండ్‌కు మరో పెద్ద షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ హ్యామ్‌స్ట్రింగ్‌కు గాయపడ్డాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. దీంతో ఓవర్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత జట్టు విజయావకాశాలను కాపాడుకునేందుకు గాయం వేధిస్తున్నా మళ్లీ బ్యాటింగ్‌కు దిగాడు హెన్రీ. ఈ సమయంలో గాయం కారణంగా అతడు పడ్డ బాధ ముఖంలో స్పష్టంగా కనిపించింది. అయితే హెన్రీ గురైన గాయం తీవ్రతపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి స్పష్టత లేనప్పటికీ.. తదుపరి జరిగే ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం ఆ జట్టుకు పెద్ద షాకే.
దెబ్బ మీద దెబ్బ..!అక్టోబర్ 5న ప్రారంభమైన ప్రపంచకప్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌తో ఆడింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును ఓడించి టోర్నీలో మంచి శుభారంభం చేసింది. అలా బోణీ కొట్టి వరుసగా నాలుగు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీంతో గ్యారెంటీ సెమిఫైనలిస్ట్గా కనిపించిన న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత జరిగిన ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడి సెమీస్‌కు చేరే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటికే గాయాల కారణంగా కీలక ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, లోకీ ఫెర్గూసన్, మార్క్ చాప్మన్లు ప్రపంచకప్ జట్టులో లేకపోవడం, ఈ సమయంలోనే స్టార్ బౌలర్‌గా కొనసాగుతున్న మ్యాట్ హెన్రీకి గాయం కావడం వంటి అంశాలు న్యూజిలాండ్‌కు దెబ్బ మీద దెబ్బ అనే చెప్పాలి.