Matheesha Pathirana On Chennai Floods :మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడులో చెన్నై సహా పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైపోయి, రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అనేక మంది, తమిళనాడు తుపాన్పై స్పందిస్తున్నారు. అయితే తాజాగా శ్రీలంక స్టార్ బౌలర్ మతీషా పతిరణ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. విస్తారంగా వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని చెన్నై ప్రజలకు సూచించాడు.
'స్టే సేఫ్, మై చెన్నై! ప్రస్తుత పరిస్థితులు భయంకరంగా ఉన్నా, మంచి రోజులు త్వరలోనే వస్తాయి. జాగ్రత్తగా ఉండండి' అని పతిరణ అన్నాడు. టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరాడు. 'ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఇవి విపత్కర పరిస్థితులు. ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్న అధికారులకు సెల్యూట్. ఇలాంటప్పుడే ఒకరికొకరం సహాయం చేసుకోవాలి' అని కార్తిక్ అన్నాడు.
Matheesha Pathirana IPL :అయితే మతీషా పతిరణ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ సమయంలోనే చెన్నైతో ఏర్పడిన బంధంతో పతిరణ ఈ విధంగా స్పందిచి ఉంటాడని నెటిజన్లు అంటున్నారు.