Marlon Samuels ICC Ban :వెస్టిండీస్ మాజీ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ గురువారం వేటు వేసింది. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి ఆరేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం ఈ నెల నవంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఇదివరకే అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన వ్యవహారంలో మార్లోన్ శామ్యూల్స్ ఈ ఏడాది ఆగస్టులో దోషిగా తేలాడు. దీంతో తాజాగా ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ హెచ్ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్‌కు చెందిన అలెక్స్ మార్షల్ వెల్లడించారు.
"శామ్యూల్స్ దాదాపు రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు, ఆ సమయంలో అతడు అనేకసార్లు అవినీతి వ్యతిరేక సెషన్లలో పాల్గొన్నాడు. అయితే అతడు ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ.. నేరం జరిగిన సమయంలో అతను క్రికెట్ ఆడాడు. నిబంధనలను అతిక్రమించే ఉద్దేశం ఉన్నవారికి ఆరేళ్ల నిషేధం వంటి శిక్ష హెచ్చరికగా ఉంటుంది" అలెక్స్ మార్షల్ తెలిపారు.
ఇదీ జరిగింది..
అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన వ్యవహారంలో మార్లోన్ శామ్యూల్స్ ఈ ఏడాది ఆగస్టులో దోషిగా తేలాడు. 2019 టీ10 లీగ్ సమయంలో ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించిన శామ్యూల్స్‌పై 2021 సెప్టెంబరులో నాలుగు నేరాల కింద ఐసీసీ అభియోగాలు నమోదు చేసింది. స్వతంత్ర అవినీతి నిరోధక ట్రైబ్యునల్ విచారణలో తన వాదనలు వినిపించిన 42 ఏళ్ల శామ్యూల్స్.. చివరికి దోషిగా తేలాడు.