టాప్ ఆర్డర్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు సాధిస్తే.. వేన్నీళ్లకు చన్నీళ్లలా ఏదో కొన్ని పరుగులు సాధిస్తే గొప్ప అన్నట్టుండేది భారత క్రికెట్లో లోయర్‌ఆర్డర్ బ్యాటింగ్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి మన టెయిలెండర్ల ప్రదర్శన మెరుగైంది.
సిడ్నీలో మూడో టెస్టులో 102 పరుగులకే 3 వికెట్లు పడితే వికెట్‌కీపర్ పంత్ (97).. జట్టును ఆదుకున్నాడు. అతడి స్ఫూర్తితో విహారి (23; 161 బంతుల్లో), అశ్విన్ (39; 128 బంతుల్లో) గొప్ప పోరాట పటిమను ప్రదర్శించి ఓటమి నుంచి తప్పించారు. ఆసీస్ బౌలర్లను అశ్విన్ ఎదుర్కొన్న తీరు ప్రశంసలందుకుంది.
ఇక ఎన్నో మలుపులు తిరిగిన నాలుగో టెస్టులో అయితే టీమ్‌ఇండియా లోయర్ ఆర్డరే మ్యాచ్ గమనాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన స్థితిలో వాషింగ్టన్ సుందర్ (62), శార్దూల్ ఠాకూర్ (67) అనూహ్య బ్యాటింగ్‌తో టీమ్‌ఇండియా 336 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ లోయర్ ఆర్డరే మళ్లీ జట్టు విజయానికి కీలకమైంది. శుభ్‌మన్ 91 పరుగులు చేసినా.. అతడితో సహా రోహిత్, రహానె, పుజారా కీలక సమయంలో ఔట్ కావడం వల్ల భారత్ చాలా ఇబ్బందుల్లో పడింది. కానీ పంత్ (89) మరోసారి ఎదురుదాడి చేసి కంగారూల నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు. సుందర్ (22) మరో కీలక ఇన్నింగ్స్‌తో తన వంతు పాత్ర పోషించాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యం వల్లే భారత్ సిరీస్‌ను నిలబెట్టుకోగలిగింది.