Surya Kumar Yadav : ముంబయిలోని బార్క్ (భాభా అటామిక్ రిసర్చ్ సెంటర్)కాలనీ.. అక్కడ పిల్లలంతా బాగా చదువుకుని, తల్లిదండ్రుల్లా సైంటిస్టులు అవ్వాలన్న ఆలోచనల్లో ఉంటారు. సూర్య తండ్రి అశోక్‌కుమార్ బార్క్‌లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. కానీ సూర్యాకి క్రికెట్‌పైన మక్కువ. 'మేం రిస్కు తీసుకుని తన ఆసక్తిని ప్రోత్సహించాం' అని చెబుతారు అశోక్. బార్క్ గ్రౌండ్‌లో శిక్షణ ఇచ్చే కోచ్ అశోక్ అశ్వాల్కర్ దగ్గర చేర్చారు.
ఎనిమిదేళ్ల సూర్యా బ్యాటింగ్ శైలిని చూసిన కోచ్.. 'రంజీల వరకూ భరోసా నాది' అన్నారు. ఎక్కువ పరుగులు చేయడంకన్నా, త్వరగా పరుగులు రాబట్టడం సూర్యాకి చిన్నప్పట్నుంచీ అలవాటు. పరుగులు ఎప్పుడూ ఎదుర్కొన్న బంతులకు రెట్టింపు ఉండేవి. 'బౌలర్లపైన ఆధిపత్యం తనదే ఉండాలనుకునేవాడు. మ్యాచ్‌లో 50-60 పరుగులు సులభంగా చేసేవాడు. మేం వాటిని భారీ స్కోర్లుగా మలచడంపైనే దృష్టి పెట్టేవాళ్లం' అని చెబుతారు అశోక్.
వర్షాకాలంలో ప్రాక్టీసుని బ్యాడ్మింటన్ కోర్టుకి మార్చేవారు. అక్కడ కాంక్రీట్ పిచ్‌మీద టెన్నిస్ బాల్‌తో ఆడేవాళ్లు. బంతులు చాలా వేగంగా దూసుకురావడంతోపాటు బౌన్స్ అయ్యేవి. తడి బంతుల్ని తక్కువ దూరం నుంచి వేయడంతో స్వల్ప వ్యవధిలోనే స్పందించాలి. ఒక అండర్-16 మ్యాచ్‌లో బౌండరీ లైన్ చాలా దూరంగా ఉన్నా ఫోర్లూ, సిక్సర్లూ బాది 40 బంతుల్లో 140 రన్స్ చేశాడు. ఆ మ్యాచ్ చూడ్డానికి వచ్చిన ఓ సెలక్టర్.. 'ఈ వయసులో అంత దూరం ఉన్న బౌండరీకి బంతిని ఎలా కొడుతున్నావ్' అని అడిగితే... 'దూరం ఎంత ఉన్నా బౌండరీలు కొట్టాలిగా సర్' అని బదులిచ్చాడు.
'ముంబయి క్రికెట్‌లో గుర్తింపు రావాలంటే... మిగతావాళ్లకు భిన్నంగా ఆడాలి. ఒక రకంగా అద్భుతాలు చేయాలి. ఆ విషయం నాకు చిన్నప్పుడే అర్థమైంది. అందుకే ఎప్పుడు ఫీల్డ్‌లోకి అడుగు పెట్టినా 'ఈరోజు నేను కొత్తగా ఏదైనా ప్రయత్నించాలి. చూసేవాళ్లకీ నాకూ అది వినోదాన్ని కలిగించాలి అనుకుంటా' అంటాడు సూర్య. అతడి దూకుడుకి ఇలాంటి అనుభవ పాఠాలెన్నో ఉన్నాయి. సెంచరీలు చేసిన చిన్ననాటి బ్యాట్‌లెన్నో ఇంకా తన దగ్గర ఉన్నాయి. వాటిలో చాలావరకూ కోచ్ బహుమతులుగా ఇచ్చినవే. ముంబయి తరఫున అండర్-16, 17, 19.. ఇలా ప్రతి విభాగంలోనూ ఆడుతూ వచ్చాడు సూర్య.
20 ఏళ్లకే 2010-11 సీజన్లో ముంబయి తరఫున రంజీల్లో అరంగేట్రం చేసిన సూర్య.. 2011-12 సీజన్లో 754 పరుగులు సాధించాడు. జట్టు తరఫున అత్యధిక పరుగులు అతడివే. తొందర్లోనే జాతీయ జట్టులో స్థానం దొరుకుతుందనుకున్నారు. కానీ తర్వాత సీజన్లో పెద్దగా రాణించలేదు. 2013-14లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా మొత్తంగా చేసిన పరుగులు తక్కువే. 2015లో ముంబయి రంజీ జట్టు కెప్టెన్సీ ఇస్తే బ్యాటింగ్‌పైన దృష్టి పెట్టాలని వదులుకున్నాడు. బాగా రాణిస్తున్నా రాష్ట్ర వన్డే జట్టుకి ఓసారి తనను ఎంపిక చేయకపోవడాన్ని సూర్య బహిరంగంగా ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. తర్వాత క్షమాపణలు చెప్పడంతో జట్టులోకి తీసుకున్నారు. అడపాదడపా ఆడినా భారీ స్కోర్లు లేవు.
ఐపీఎల్‌తో గుర్తింపు..
ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ద్వారా రాని గుర్తింపు ఐపీఎల్‌లో వచ్చింది. రూ.10 లక్షలు చెల్లించి 2011లో ముంబయి తీసుకుంది. కానీ సీనియర్ ఆటగాళ్ల మధ్య చోటు దొరకలేదు. మూడు సీజన్లున్నా 2-3 మ్యాచ్‌లలోనే అవకాశం వచ్చింది. దిగ్గజాలను దగ్గరగా చూస్తూ ఎంతో నేర్చుకున్నాడు. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.70లక్షలకు ఎంపికచేసింది. ఆ సంవత్సరమే కేకేఆర్ కప్ గెలిచింది.
ఆ సీజన్లో ఫినిషర్‌గా చాలా మ్యాచ్‌లు గెలిపించాడు. తర్వాత ఆ జట్టు వైస్ కెప్టెన్‌గా చేశాడు. సూర్యా జోరుని చూసి 2018లో ముంబయి రూ.3.2 కోట్లకు కొంది. ఇప్పుడు అతనికి ఎనిమిది కోట్లు చెల్లిస్తున్నారు. ముంబయికి తిరిగొచ్చాక- టీమిండియాలో చోటు సంపాదించడానికి అంతకన్నా మంచి వేదికా, సమయమూ దొరకవని అర్థమైంది సూర్యాకి. అప్పటికి 27 ఏళ్లు. తనతో అండర్-23 ఆడిన కె.ఎల్.రాహుల్, బుమ్రా, అక్షర్ పటేల్ అప్పటికే టీమిండియాకి ఆడుతున్నారు. 2016లో సూర్యాకి దేవిషా శెట్టితో పెళ్లైంది. ఆమెకూడా భర్త కెరియర్‌పైన దృష్టి పెట్టాలనుకుంది.
'సర్, ముంబయి తిరిగొచ్చా.. ఓసారి మాట్లాడాలి' అంటూ చిన్ననాటి కోచ్ అశోక్‌కి సమాచారమిచ్చాడు సూర్య. ముగ్గురూ కూర్చున్నారు. ఎలాగైనా 2018 సూర్యాకి ప్రత్యేకమైందిగా నిలవాలనుకున్నారు. 'నన్ను మెరుగుపర్చుకునేందుకు అన్ని విధాలా సిద్ధం. నా కంఫర్ట్ జోన్ దాటి వస్తా' మాటిచ్చాడు సూర్య. బంతిని బలంగా కొట్టడంతో పరుగులు వస్తున్నాయి. కానీ తన ఆటలో లోపాలున్నాయి. వాటిలో ప్రధానమైంది ఆఫ్‌సైడ్ ఎక్కువగా పరుగులు రాబట్టలేకపోవడం. అందుకే ఆఫ్‌సైడ్ స్ట్రోక్స్ ఆడేలా యువ ఆటగాళ్లతో, బౌలింగ్ యంత్రంతో సుదీర్ఘమైన సెషన్లు ప్రాక్టీసు చేసేవాడు.
డైట్‌లో బిర్యానీ, ఐస్‌క్రీమ్‌లు పోయాయి. సన్నబడి వేగంగా కదిలేలా చూసుకున్నాడు. మధ్య ఓవర్లు ఆడాలంటే స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. అందుకోసం సాయంత్రాలు కాకుండా ఎర్రటి ఎండలో 12-3 గంటల మధ్య ప్రాక్టీసు చేసేవాడు. ఆ టైమ్‌లో మట్టి పిచ్‌మీద స్పిన్ బాగా తిరుగుతుంది. అలా స్పిన్‌ని సమర్థంగా ఎదుర్కోవడానికీ సిద్ధమయ్యాడు. ఏడెనిమిదేళ్లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాక మనకంటూ ఒక ఆటతీరు అలవాటు అవుతుంది. దీన్ని ‘మజిల్ మెమొరీ’ అంటారు. దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. కానీ సూర్య మార్చుకున్నాడు.
అతడిలోని ఈ మార్పులు గమనించిన ముంబయి జట్టు హెడ్ కోచ్ జయవర్థనే, మెంటార్ సచిన్... సూర్యాని టాప్ ఆర్డర్‌లో ఆడించారు. ఆ సీజన్లో రాణించి 512 పరుగులు చేశాడు. 'అంతర్జాతీయ స్థాయిలో ఆడేటప్పుడు ప్రత్యర్థులు.. మన బలాలూ, బలహీనతల్ని పరిశీలిస్తారు. ఒకే రకమైన షాట్లు ఆడుతూ అక్కడ రాణించడం అంత సులభం కాదు. నన్ను నేను అప్పటికే మార్చుకోవడం నాకెంతో లాభించింది' అంటాడు సూర్య.