లెజెండ్స్ లీగ్ క్రికెట్ తాజా సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఓ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్‌తో ఈ లీగ్ ప్రారంభం కానుంది.. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో సెప్టెంబరు 16న జరిగే ఈ మ్యాచ్‌లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. ఈ విషయాన్ని ఎల్ఎల్సీ కమిషనర్ రవిశాస్త్రి తెలిపారు.
వాస్తవానికి తొలుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా టీమ్ఇండియా.. రెస్టాఫ్ వరల్డ్ టీమ్‌తో తలపడాల్సి ఉంది. ఆ మ్యాచ్ తొలుత ఆగస్టు 22న నిర్వహించాలనుకున్నారు. కానీ.. ఇతర బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదు. ఇప్పుడు లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగానే తొలి మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్‌తో భారత్ తలపడనుంది.
భారత జట్టుకు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సారథిగా వ్యవహరించగా.. వరల్డ్ జెయింట్స్‌కు 2019 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథిగా ఉండనున్నాడు. కాగా, 17నుంచి యథాతథంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. ఇందులో 3 జట్లు.. 22 రోజుల పాటు 15 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
భారత జట్టులో గంగూలీతో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజాలు ఆడనున్నారు. వీళ్లంతా గంగూలీ సారథ్యంలో భారత జట్టుకు ఆడినవారే కావడం విశేషం.