తెలంగాణ

telangana

ETV Bharat / sports

సురేశ్​ రైనా విధ్వంసం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్​లతో.. - legends cricket league live updates

టీమ్​ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్​ రైనా అదిరిపోయే ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. 45 బంతుల్లో 90*; 10 ఫోర్లతో నాలుగు సిక్స్​లతో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్ వివరాలు..

Suresh Raina legends cricket league
సురేశ్​ రైనా విధ్వంసం.. 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్​లు..

By

Published : Mar 23, 2023, 9:15 PM IST

టీమ్​ఇండియా మాజీ బ్యాటర్ సురేశ్​ రైనా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బరిలోకి దిగాడంటే ఫోర్లు, సిక్సులతో మైదానాన్ని హోరెత్తిస్తాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ చెమటలు పట్టిస్తాడు. అయితే తాజాగా మరోసారి అతడు తన హిట్టింగ్ ఎలా ఉంటుందో గట్టిగా చూపించాడు. ఘజియాబాద్‌ వేదికగా జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ ట్రోఫీలో ధనాధన్ ఇన్నింగ్స్​ ఆడి ఫ్యాన్స్​కు అదిరిపోయే కిక్​ ఇచ్చాడు. ఇండోర్‌ నైట్స్‌, నాగ్‌పూర్‌ నింజాస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో తన బ్యాట్​కు పని చెప్పాడు. ఫలితంగా అతడి ఇన్నింగ్స్​తో ఇండోర్‌ నైట్స్‌.. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ఫస్ట్​ బ్యాటింగ్​కు దిగిన ఇండోర్‌ నైట్స్‌.. ఫిల్‌ మస్టర్డ్‌ (39 బంతుల్లో 53; 6x4, 2x6), సురేశ్‌ రైనా (45 బంతుల్లో 90*; 10x4, 4x6) మెరుపు హాఫ్‌ సెంచరీల వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ చేసింది. నింజాస్‌ బౌలర్లలో కుల్దీప్‌ హుడా 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ప్రిన్స్‌ 2 వికెట్లు సాధించాడు.

అనంతరం 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నింజాస్‌లో.. బౌలింగ్​లో చెలరేగిన కుల్దీప్‌ హుడా(42 బంతుల్లో 77; 7x4, 5x6) బ్యాటింగ్​లోనూ విజృంభించి తమ జట్టును గెలిపించేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ నింజాస్‌ ఇన్నింగ్స్‌లో మిగతా ప్లేయర్స్​ రిచర్డ్‌ లెవి (13), వీరేంద్ర సింగ్‌ (15), అభిమన్యు (13), రితేందర్‌ సింగ్‌ సోధి (11) విఫలమయ్యారు. సత్నమ్‌ సింగ్‌ (32), ప్రిన్స్‌ పర్వాలేదనిపించారు. మొత్తంగా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి నింజాస్‌ 7 వికెట్ల నష్టానికి 198 పరుగుల మాత్రమే చేసింది. ఫలితంగా 11 పరుగుల తేడాతో పరాజయాన్ని అందుకుంది. ఇండోర్‌ బౌలర్లలో కపిల్‌ రాణా 3 వికెట్లు, రాజేశ్‌ ధాబి 2 వికెట్లు, జితేందర్‌ గిరి, సునీల్‌ చెరో వికెట్‌ తీశారు. కాగా, టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ సారథ్యంలో బరిలోకి దిగిన నింజాస్‌కు ఈ టోర్నీలో ఇదే తొలి ఓటమి.

ఇకపోతే ఈ టోర్నీలో దేశీయ ఆటగాళ్లతో పాటు పలువురు నేషనల్​, ఇంటర్నేషనల్​ స్టార్ ప్లేయర్లు కూడా ఆడుతున్నారు. తిలకరత్నే దిల్షాన్‌, రాస్‌ టేలర్‌, మాంటీ పనేసర్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, సనత్‌ జయసూర్య, ఉపుల్‌ తరంగ, హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, వీరేంద్ర సెహ్వాగ్‌ సహా పలువురు ప్లేయర్లు ఈ టోర్నీలో ఉన్నారు. వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదీ చూడండి:World Boxing Championship: అమ్మాయిల పంచ్.. ఫైనల్​కు నిఖత్​, నీతూ

ABOUT THE AUTHOR

...view details