IND VS WI T20 Series: విండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తేడాతో భారత్ ముందంజ వేసింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగానే జరుగుతాయని విండీస్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం తొలుత ఫ్లోరిడానే వేదిక. అయితే, ఆటగాళ్లకు నిన్నటి వరకు వీసాలు లభించకపోవడం వల్ల వెస్టిండీస్‌లోనే నిర్వహించాలని బోర్డు భావించింది. అయితే, గురువారం ఆటగాళ్లకు యూఎస్ వీసాలు మంజూరు కావడంతో యథావిధిగా అమెరికాలో ఆఖరి రెండు టీ20లను నిర్వహిస్తున్నట్లు విండీస్ బోర్డు ప్రకటించింది. గయనా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ జోక్యంతోనే వీసాల ప్రక్రియ సజావుగా సాగిందని తెలిపింది.
తొలి టీ20 మ్యాచ్ బ్రియాన్ లారా స్టేడియంలో జరగగా.. రెండు, మూడు టీ20లు సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ మైదానంలో జరిగాయి. మంగళవారమే మూడో టీ20 మ్యాచ్ ముగిసింది. అక్కడి నుంచే నేరుగా ప్రత్యేక విమానంలో ఆటగాళ్లు ఫ్లోరిడా బయలుదేరి వెళ్లాల్సి ఉంది. కానీ, వీసాల మంజూరులో జాప్యం కావడంతో శుక్రవారం వెళ్లే అవకాశాలు ఉన్నాయిని విండీస్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు వెల్లడించారు. తొలి టీ20 జరిగిన ట్రినిడాడ్ నుంచి ఆటగాళ్ల లగేజీ రాకపోవడంతో రెండు, మూడో మ్యాచ్‌లు ఆలస్యంగా నిర్వహించిన విషయం తెలిసిందే. విండీస్ బోర్డు సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వీసాలను తెచ్చుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శించిందనే ఆరోపణ లేకపోలేదు.