Kohli steps down: విరాట్ కోహ్లీ.. ఇప్పటి నుంచి టీమ్ఇండియా మాజీ కెప్టెన్. అయితే ఈ మాటను క్రికెట్ అభిమానుల జీర్ణించుకోలేకపోతున్నారు. బ్యాటర్‌గా ఎన్నో ఘనతల్ని అవలీలగా అందుకున్న ఇతడు.. సారథిగానూ సరికొత్త ఘనతలు సాధించాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడనే వెలితి తప్ప.. భారత క్రికెట్ జట్టు చూసిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. కోహ్లీ.. గత ఐదు నెలల్లోనే ఐపీఎల్, టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా వైదొలిగాడు.
జట్టు సభ్యులకు ముందే?
గత కొంతకాలంగా కేవలం టెస్టులకు మాత్రమే కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. శనివారం దానికి కూడా వీడ్కోలు పలికాడు. అంతకు ఓ రోజు ముందే, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఓటమి అనంతరం జట్టు సభ్యులతో మీటింగ్ పెట్టిన విరాట్.. వాళ్లకు తన కెప్టెన్సీ వదులుకోవడం గురించి చెప్పాడట. ఆ విషయాన్ని బయటకు వెల్లడించొద్దని కోరాడని సమాచారం.
ఈ సిరీస్‌లో తొలి టెస్టు గెలిచిన టీమ్ఇండియా.. మిగిలిన రెండు టెస్టుల్లో తక్కువ తేడాతోనే ఓటమిపాలైంది. దీంతో కెప్టెన్ కోహ్లీపై విమర్శలు వెల్లువెత్తాయి. అలా సారథిగా తాను తప్పుకొంటున్న ప్రకటించిన విరాట్.. అందరినీ ఆశ్చర్యపరిచాడు.