టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ కోపంగా చూసిన ఓ చూపు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ రెండో ఓవర్ బౌలింగ్ చేసిన ఉమేశ్ యాదవ్.. తొలి నాలుగు బంతుల్లో వరుసగా 4,4,4,4 సమర్పించుకున్నాడు. మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టీ20ల్లో ఆడిన ఉమేశ్.. వరుసగా ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా బంతులు వేయడం వల్ల.. వాటిని ఆస్ట్రేలియా ప్రయోగాత్మక ఓపెనర్ కామెరూన్ గ్రీన్ బౌండరీకి తరలించేశాడు.
దీంతో అతడి పేలవ బౌలింగ్..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కోపం తెప్పించింది. కానీ ఒక్క మాట అనలేదు. అయితే.. కోపంగా మాత్రం ఉమేశ్వైపు చూస్తూ కనిపించాడు. ఇదే విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అసహనం వ్యక్తం చేశాడు.
రోహిత్ ఫన్నీ సెండాఫ్.. ఇక ఇదే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌కు సారథి రోహిత్ శర్మ ఫన్నీగా సెండాఫ్ ఇచ్చాడు. మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో దూకుడుగా ఆడుతున్న స్టీవ్‌స్మిత్‌ను వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అడ్డుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కు వెలుపలగా వెళ్తున్న బంతిని స్టీవ్‌స్మిత్ బాదగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి దినేశ్ కార్తీక్ చేతుల్లో పడింది. దీంతో వెంటనే టీమ్ఇండియా అప్పీల్ చేయగా.. అంపైర్ తిరస్కరించాడు.