Kohli Records To Break In 2024 :టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2023లో అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా వన్డే వరల్డ్‌కప్‌లో అదరగొట్టాడు. 765 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అదే టోర్నీలో సచిన్ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల (వన్డేల్లో) రికార్డును బ్రేక్ చేశాడు. 2023లో కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి 35 మ్యాచ్‌లు ఆడి 2048 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 10 అర్ధ శతకాలు ఉన్నాయి. 2024లోనూ 'కింగ్' కోహ్లీ ఇదే ఫామ్‌ను కొనసాగించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కొత్త ఏడాది వికాట్ కోహ్లీ కొన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశముంది.
కొత్త ఏడాదిలో కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే! - Kohli Records In 2024
Kohli Records To Break In 2024 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2023లో అదరగొట్టాడు. వన్డేల్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను తెందూల్కర్ అత్యధిక సెంచరీల రికార్డును సైతం అధిగమించాడు. 2024లోనూ అదే ఫామ్ కొనసాగించాలనుకుంటున్న విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు ఇవే!
Kohli Records To Break In 2024
Published : Jan 1, 2024, 8:34 PM IST
2024లో విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు
- వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా అవతరించడానికి విరాట్ కోహ్లీ కేవలం 152 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ 350 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు 292 వన్డేలు ఆడిన విరాట్ 14 వేల పరుగుల దగ్గరికి వచ్చాడు.
- కోహ్లీ మరో 35 పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన మొదటి టీమ్ఇండియా ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (12,993), కిరన్ పొలార్డ్ (12,390) పరుగులతో విరాట్ కంటే ముందున్నారు.
- ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జనవరిలో భారత్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో విరాట్ రాణించి 544 పరుగులు చేస్తే, సచిన్ (2,535 పరుగులు)ని అధిగమిస్తాడు. దీంతో టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.
- విరాట్ మరో 21 పరుగులు చేస్తే అన్ని ఫార్మాట్లలో ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. కోహ్లీ మరో 30 పరుగులు చేస్తే ఇంగ్లాండ్‌పై ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 4,000 పరుగులు చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలుస్తాడు.
- కింగ్ కోహ్లీ మరో శతకం సాధిస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం విరాట్, సచిన్ తొమ్మిదేసి సెంచరీలతో సమంగా ఉన్నారు.
- విరాట్ టెస్టుల్లో బంగ్లాదేశ్‌పై మరో 383 పరుగులు చేస్తే సచిన్ (820 పరుగులు)ను అధిగమించి భారత్ తరఫున అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్‌గా అవతరిస్తాడు.