Kohli Performance: ఒకప్పటిలా కాకుండా ధీమాగా దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్‌ఇండియా.. అంచనాలను అందుకుంటూ తొలి టెస్టులో అదిరే ప్రదర్శన చేసింది. విజయానికి ప్రధాన కారణం బుమ్రా, షమి, సిరాజ్‌లతో కూడిన మేటి పేస్ దళం అనడంలో సందేహం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల్లో సిరీస్‌లు అందించిన పేసర్లు తమపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. కానీ తొలి టెస్టులో రాహుల్, మాయంక్ మినహా ఎవరూ పెద్దగా పరుగులు చేయని నేపథ్యంలో.. ఇప్పుడు దృష్టంతా బ్యాట్స్‌మెన్‌పైనే. మరీ ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ పైన. జట్టులో తమ స్థానాలే ప్రశ్నార్థకమైన వేళ పుజారా, రహానేలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. వాళ్లలా జట్టులో స్థానం కోసం పోరాడాల్సిన స్థితిలో లేకపోయినా కోహ్లి ఒత్తిడిలోనే ఉన్నాడు. పేలవ ఫామ్ నుంచి బయటపడేందుకు అతడు తంటాలు పడుతున్నాడు. కానీ అతడిపై ఒత్తిడికి అదొక్కటే కారణం కాదు.
Kohli Performance: ఈ ఏడాదైనా కోహ్లీకి కలిసొస్తుందా? - టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్
Kohli Performance: దక్షిణాఫ్రికా పర్యటన అంటే ఎప్పుడూ సవాలే. పేస్, బౌన్సీ పిచ్‌లపై సర్రున దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం మన బ్యాట్స్‌మెన్‌కు పరీక్షే. కానీ ఈసారి పర్యటనలో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. సెంచూరియన్ టెస్టు గెలవడం ద్వారా సిరీస్ కలను నెరవేర్చుకునే దిశగా రెట్టించిన విశ్వాసంతో అడుగు ముందుకేసింది. కానీ కెప్టెన్ కోహ్లి మాత్రం తన స్థాయికి తగని ఫామ్‌ను కొనసాగించాడు. గత రెండేళ్లు తన ప్రదర్శనతో తీవ్ర నిరాశకు గురి చేసిన అతను.. కొత్త ఏడాదిలో అయినా తన పూర్వపు ఫామ్‌ను అందుకోవాలన్నది అభిమానుల ఆకాంక్ష.
11 మ్యాచ్‌ల్లో 536: కోహ్లి..నిస్సందేహంగా ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మెన్‌లో ఒకడు. కానీ అన్ని ఫార్మాట్లలో ఓ యంత్రంలా పరుగులు సాధించిన అతణ్ని ఇప్పుడు పేలవ ఫామ్ వేధిస్తోంది. నిజానికి తనంతట తాను కెప్టెన్సీని వదులుకున్న టీ20 క్రికెట్లో కోహ్లి ప్రదర్శన గొప్పగానే ఉంది. గత 23 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అతడి సగటు 59.76. అదే వన్డేల్లో గత 15 మ్యాచ్‌ల్లో సగటు 43.26. ఫర్వాలేదనిపించే సగటే అయినా.. కోహ్లి ప్రమాణాల మేర చూస్తే మాత్రం అది తక్కువన్నట్లే. కానీ కోహ్లీకి అసలు దెబ్బ మాత్రం.. తాను అన్నింటికంటే ఉత్తమ ఫార్మాట్ అని ఎప్పుడూ చెప్పే టెస్టు క్రికెట్లో తగిలింది. మూడు ఫార్మాట్లలో అవిశ్రాంతంగా ఆడడం, నాయకత్వం వహించడం వల్లనేమో.. ఒత్తిడి అతడి బ్యాటింగ్‌ను, సగటును దెబ్బతీసింది. కెరీర్‌లో ఎప్పుడూలేని హీన దశను ఎదుర్కొంటున్న కోహ్లి.. 2021లో 11 టెస్టుల్లో 28.21 సగటు, నాలుగే అర్దశతకాలతో కేవలం 536 పరుగులు చేశాడు. ఒకప్పుడు పరుగుల వరద పారించిన కోహ్లీనేనా అన్న భావన కలుగుతోంది. అతడి బ్యాటింగ్‌లో సాధికారత లోపించింది. తాజా సెంచూరియన్ టెస్టునే తీసుకుంటే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని వెంటాడి ఔటయ్యాడు. అతడు సెంచరీ చేసి ఎంతకాలమైందో! ఎప్పుడో 2019 నవంబరు (బంగ్లాదేశ్‌తో టెస్టులో)లో చివరిసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఆ జోరు కొనసాగించి ఉంటే ఈపాటికి సచిన్ శతక శతకాల రికార్డుకు చేరువయ్యేవాడే. కానీ అప్పటి నుంచి అతడు ఏ ఫార్మాట్లోనూ శతకం సాధించలేకపోయాడు. టెస్టుల్లో పరుగుల వేటలో వెనుకబడ్డ సీనియర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రహానేలపై వేటు వేయకపోవడానికి కోహ్లి ప్రదర్శన కూడా ఓ కారణమని భావిస్తున్నారు. కోహ్లి ఫామ్‌ను విస్మరించి పుజారా, రహానేలపై మాత్రమే వేటు వేయడం సెలక్టర్లకు సంకటంగా మారిందని ఓ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో తప్పక రాణించాల్సిన పరిస్థితిలో కోహ్లి ఉన్నాడు. అందరి దృష్టి తనపై ఉండగా కఠినమైన పిచ్‌లపై ఫామ్‌ను అందుకోవడం అతడికి సవాలే. ఒక కెప్టెన్‌గా మరింత కాలం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తే జట్టుపై పట్టు నిలుపుకోవడం కూడా అతడికి సమస్యే. బీసీసీఐ పెద్దలతో విభేదాల నేపథ్యంలో కూడా తనను తాను నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత కోహ్లీకి ఏర్పడింది. కోహ్లి తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, తనను అమర్యాదకరంగా తొలగించారని అర్థం వచ్చేలా వ్యాఖ్యానించడం, బోర్డు అధ్యక్షుడు గంగూలీతో బహిరంగంగానే విభేదించడంతో పెద్ద దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఇవి బోర్డుకు, అతడికి మధ్య అగాథాన్ని పెంచాయి. తాజాగా.. చీఫ్‌సెలక్టర్ చేతన్ శర్మ స్పందన కూడా కోహ్లీకి ప్రతికూలమైందే. తనకెంతో ఇష్టుడైన కోచ్ రవిశాస్త్రి నిష్క్రమణ కూడా కోహ్లీకి ఇబ్బంది కలిగించేదే. మొత్తంగా బోర్డులో అతడి పట్ల ఒకప్పటంత సానుకూలత ఇప్పుడు లేదన్నది, టీమ్ మేనేజ్‌మెంట్లో గతంలోలా అతడి మాటల చెల్లుబాటు కాదన్నది స్పష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ఆటపై లఘ్నం చేసి పరుగుల బాట పట్టడం అతడికి పెద్ద పరీక్షే మరి. దక్షిణాఫ్రికాతో టెస్టులో ఆకట్టుకోలేకపోయిన అతడు.. మిగతా రెండు టెస్టుల్లోనైనా పుంజుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరం.
ఇదీ చూడండి: ఇటలీ టెన్నిస్ భామ.. పరువాల పుత్తడిబొమ్మ