Kohli mutton roll: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైట్ కూడా క్రమం తప్పుకుండా పాటిస్తాడు. అయితే విరాట్ ఆహార ప్రియుడని మీకు తెలుసా? రోడ్డు పక్కన చిరుతిండ్లంటే ఎంతో ఇష్టంగా లాగించేస్తాడని తెలుసా? అతడికి ఫుడ్ అంటే ఎంత ఇష్టమంటే.. ఓ సారి మటన్ రోల్ కోసం ఏకంగా తన ప్రాణాన్నే రిస్క్‌లో పెట్టాడట! ఈ విషయాన్ని విరాట్ మిత్రుడు, సహ ఆటగాడు ప్రదీప్ సంగ్వాన్ తెలిపాడు.
"జూనియర్ క్రికెట్లో 7-8 ఏళ్లు నేను, కోహ్లీ రూమ్మేట్స్. అతడు మంచి ఆహార ప్రియుడు. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే చిరుతిళ్లను బాగా ఇష్టపడతాడు. కోర్మ రోల్స్, చికెన్ రోల్స్ బాగా తింటాడు. మేము దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు.. ఓ ప్రాంతంలో మటన్రోల్ సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారు. అయితే అక్కడ దుండగులు, జేబు దొంగలు కూడా ఉంటారన్నారు. ఓ సారి ఆ ప్రాంతంలో కొంతమంది దుండగులు కలిసి ఒకరి చెయ్యి నరికేశారని మా డ్రైవర్ కూడా చెప్పాడు. నేను భయపడ్డాను. కానీ విరాట్ మాత్రం 'పద వెళ్దాం.. ఏం కాదు' అని అన్నాడు. నన్ను కూడా తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లి మటన్ రోల్ తినేశాం. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు మమ్మల్ని ఛేస్ చేయడం ప్రారంభించారు. కానీ మేం మా కారుని ఎక్కడా ఆపకుండా గమ్యస్థానానికి చేరుకున్నాం."