ఇప్పటికే టీ20 పగ్గాలు వదిలేసిన విరాట్ కోహ్లీ.. ఇతర ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ (Virat Kohli Captaincy) వదులుకునే అవకాశం ఉందని చెప్పాడు టీమ్ఇండియా మజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ప్రత్యేకించి కొవిడ్ సమయంలో పనివల్ల కలిగే ఒత్తిడిని అధిగమించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని అన్నాడు.
కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లో ఐదేళ్లుగా టీమ్ఇండియా అగ్రస్థానంలో ఉంది. మానసిక అలసట కారణంగా.. 'నేను నా బ్యాటింగ్‌పై దృష్టిసారించాలని అనుకుంటున్నా' అంటూ అతడు కెప్టెన్సీని వదులుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా తర్వాతైనా అలా జరుగుతుంది. వన్డేల్లోనూ అదే జరగొచ్చు. అది అతడే నిర్ణయించుకుంటాడు. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఎందరో విజయవంతమైన క్రికెటర్లు కెప్టెన్సీ వదిలేశారు. అయితే వన్డేల్లో సారథ్యం వదిలేసి, టెస్టుల్లో కొనసాగాలని అతడు భావిస్తే చాలామంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే.. టెస్టు క్రికెట్‌కు అతడే అత్యుత్తమ ప్రతినిధి"
- రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్
టీ20 ప్రపంచకప్‌తో(T20 World Cup 2021) కోచ్‌గా శాస్త్రి పదవీకాలం ముగిసింది. నవంబర్ 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో (New Zealand Tour of India) జరిగే టీ20 సిరీస్, ఒక టెస్టు వరకు కోహ్లీకి విశ్రాంతి లభించింది. అప్పటివరకు టీ20లకు రోహిత్ శర్మ, ఎర్ర బంతి ఫార్మాట్‌కు రహానెకు(Rahane News) సారథిగా బాధ్యతలు అప్పగించారు. రెండో టెస్టులో కోహ్లీ.. మళ్లీ నాయకుడిగా (Virat Kohli Captaincy News) జట్టుతో చేరనున్నాడు.
ఐపీఎల్ (IPL 2021) జరిగిన వెంటనే ప్రపంచకప్ ఆడటం టీమ్ఇండియాకు చేటు చేసిందని రవిశాస్త్రి అన్నాడు. అయితే అందుకు బీసీసీఐని తప్పుబట్టడం లేదని, రీషెడ్యూలింగ్ కరోనా కారణంగానే జరిగిందని చెప్పాడు. "బీసీసీఐ మాత్రమే కాదు, ప్రతీ జట్టు షెడ్యూలింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఐపీఎల్ కూడా కలిపితే ప్రపంచంలోని ఏ జట్టు ఆడనన్ని మ్యాచ్‌లు భారత్ ఆడుతోంది." అని శాస్త్రి వివరించాడు.