మేటి బ్యాట్స్‌మెన్‌గా పేరున్న చాలామంది కెప్టెన్సీ భారాన్ని మోయలేక విడిచిపెట్టిన వాళ్లే. కానీ కోహ్లీ మాత్రంకెప్టెన్సీ(Kohli Captaincy) తనకే మాత్రం భారం కాదని చాటుతూ బ్యాట్‌తో గొప్పగా రాణించాడు. కానీ గత రెండేళ్లుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్నది నిజం. మూడు ఫార్మాట్లలోనూ నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 53 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి. విరాట్ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీగా అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీని(Kohli RCB) ఒక్కసారి కూడా విజేతగా నిలపకపోవడాన్ని అతని నాయకత్వ లోపంగా చూస్తున్నారు. మరోవైపు రోహిత్ నాయకత్వంలో(Rohit Sharma Captaincy News) ముంబయి అయిదుసార్లు టైటిల్ గెలిచింది. దీంతో టీ20లకు రోహిత్‌ను సారథిగా నియమించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నిర్ణయం(Kohli Stepping Down) తీసుకున్నాడనిపిస్తోంది.
ఇప్పుడే ఎందుకు?
భారత క్రికెట్లో గతంలో ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి ఆటగాళ్లు రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ 2007 తర్వాత అలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. నాయకత్వ బదలాయింపు సాఫీగా సాగిపోతోంది. ధోనీ చేతుల్లో నుంచి కోహ్లీ అలాగే పగ్గాలు స్వీకరించాడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా దిగిపోతానని ప్రకటించడం వెనక కూడా ఇదే సానుకూల వైఖరి కనిపిస్తోంది.