తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ x గంగూలీ.. ఇంత వివాదం ఎందుకు? - rohit sharma news

Kohli Ganguly Controversy: విరాట్‌ కోహ్లీ.. భారత జట్టులో ఇప్పటివరకు ఎదురులేని సారథి. తన ఆటతో, వ్యూహ పటిమతో జట్టును ముందుండి నడిపించిన మేటి క్రికెటర్‌. ఫార్మాట్లకు అతీతంగా వరుసగా సిరీస్‌లు గెలుస్తూ టీమ్‌ ఇండియాను బలమైన జట్టుగా తీర్చిదిద్దాడు. ఫలితంగా తనకెవరూ సాటిరాని విధంగా ఎదిగిపోయాడు. కానీ, పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే సత్యం అందరికీ తెలిసిందే. కోహ్లీ విషయంలో ఇప్పుడు అచ్చం అదే జరిగింది. కెప్టెన్​గా ఎంత మంచి రికార్డున్నా.. ఎన్ని గొప్ప విజయాలు నమోదు చేసినా.. ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదనే అపవాదును మోయాల్సి వచ్చింది.

kohli ganguly
విరాట్‌ కోహ్లీ

By

Published : Dec 16, 2021, 2:33 PM IST

Kohli Ganguly Controversy: విరాట్‌ కోహ్లీ సారథ్యంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో రాణించింది. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక సిరీస్‌లు కూడా గెలుపొందింది. అయినా, చివరికి కథ అడ్డం తిరిగింది. టీ20 సారథ్యం నుంచి హుందాగా తప్పుకొన్న కోహ్లీని సెలక్షన్‌ కమిటీ ఇటీవల వన్డేల నాయకత్వం నుంచి తొలగించడం వివాదాస్పదంగా మారింది. సారథ్యం తొలగింపుపై కోహ్లీ - బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ మీడియాతో పంచుకున్న విషయాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఈ అంశం కొత్త సందేహాలకు దారితీస్తోంది. అసలు ఇప్పటివరకూ ఏం జరిగింది. ఈ వివాదం ఎలా చెలరేగిందో క్లుప్తంగా తెలుసుకుందాం.

బాధ్యతలు ఇలా..

కోహ్లీ-ధోనీ
  • 2014లో నాటి సారథి మహేంద్రసింగ్‌ ధోనీ నుంచి కోహ్లీ టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఫార్మాట్లో జట్టును విజయవంతంగా నడిపించడం వల్ల మహీ 2017లోనే పరిమిత ఓవర్ల ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలను సైతం కోహ్లీకే అప్పగించాడు. దీంతో నాటి నుంచి మూడు ఫార్మాట్లకు విరాట్‌ నాయకత్వం వహించాడు.

ఓటములంటే ఇవే..

  • కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా దాదాపు అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుపొందిందనే చెప్పొచ్చు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌లు మాత్రమే ఓడిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో బాగా రాణించింది. ముఖ్యంగా SENA (South Africa, England, New Zealand, Australia) దేశాల్లో టీ20 సిరీస్‌లు కైవసం చేసుకుంది. అయితే, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీస్‌, 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ, 2021 టీ20 ప్రపంచకప్‌లో విఫలమైంది.

virat kohli vs rohit sharma:రోహిత్‌తో విభేదాలు తెరపైకి..

కోహ్లీ-రోహిత్
  • 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక.. కోహ్లీ, రోహిత్‌ మధ్య విభేదాలున్నాయనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, వీటిపై కొద్దికాలం మౌనం పాటించిన విరాట్‌.. చివరికి తమ మధ్య అలాంటివేమీ లేవని మీడియాకు చెప్పాడు. దాంతో ఆ వివాదానికి తెరపడింది.

కోహ్లీని తొలగించాలని డిమాండ్‌..

  • 2019 వన్డే ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే కోహ్లీని పరిమిత ఓవర్ల సారథిగా తొలగించాలనే డిమాండ్లు బలపడ్డాయి. క్రికెటర్లు, మాజీలు ఈ విషయంపై పెద్దగా స్పందించకపోయినా సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున చర్చ జరిగింది. కోహ్లీ ఐపీఎల్‌లో ఆర్సీబీని, ఇటు ఐసీసీ టోర్నీల్లో భారత జట్టును ఒక్కసారి కూడా విజేతగా నిలపలేకపోవడమే అందుకు కారణం. మరోవైపు రోహిత్‌ ఐపీఎల్‌లో ఐదుసార్లు ముంబయిని ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దీంతో కోహ్లీని తొలగించాలనే డిమాండ్‌ పెరిగింది.

అదే బెడిసికొట్టిందా..?

విరాట్
  • విరాట్‌ ఈ ఏడాది యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ సమయంలో తొలుత ఆర్సీబీ జట్టు సారథిగా ఇదే చివరి సీజన్‌ ఆడుతున్నట్లు చెప్పాడు. ఇకపై ఆ ఫ్రాంఛైజీలో ఆటగాడిగా కొనసాగినా సారథిగా ఉండనన్నాడు. మరో రెండు రోజులకే టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గానూ ఉండనని స్పష్టం చేశాడు. పనిభారం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అయితే, అప్పుడు వన్డే, టెస్టులకు మాత్రం కెప్టెన్సీ చేపడతానని అందరికీ వివరించాడు.

virat kohli vs bcci:షాకిచ్చిన బీసీసీఐ..

  • టీ20 ప్రపంచకప్‌ తర్వాత విరాట్‌ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో రోహిత్‌ టీ20లకు కెప్టెన్సీ చేపట్టగా తొలి టెస్టుకు రహానె నాయకత్వం వహించాడు. చివరికి కోహ్లీ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చి మళ్లీ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అయితే, దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు ఎంపిక చేసినప్పుడే బీసీసీఐ కోహ్లీకి షాకిచ్చింది. ఇకపై వన్డేలకు సారథిగా రోహిత్‌ను ప్రకటించింది.

గంగూలీ ఏమన్నాడు..?

గంగూలీ
  • కోహ్లీని వన్డే సారథ్యం నుంచి తప్పించిన తర్వాత వివాదం చెలరేగడం వల్ల బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మీడియాతో మాట్లాడుతూ.. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు తాము వారించామన్నాడు. అయినా, విరాట్‌ తన నిర్ణయానికే కట్టుబడ్డాడని చెప్పాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసే ముందు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఇద్దరు సారథులు ఉండకూడదని సెలక్షన్‌ కమిటీ భావించిందని దాంతో ఆ నిర్ణయం తీసుకుందని తెలిపాడు. ఈ విషయాన్ని కోహ్లీకి ముందే వెల్లడించినట్లు గంగూలీ పేర్కొన్నాడు.

virat kohli press conference: కోహ్లీ మాటలు మరోరకం..

  • అయితే, గంగూలీ చెప్పిన మాటలకు కోహ్లీ చెప్పిన మాటలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం ఈ నెల 8న జరిగిన సెలక్షన్‌ కమిటీ సమావేశానికి గంటన్నర ముందు మాత్రమే సెలక్టర్లు తనతో మాట్లాడారని తెలిపాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగిన తర్వాత తనతో ఎవరూ మాట్లాడలేదన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు జట్టును ఎంపిక చేసినప్పుడు కాల్‌ ముగియడానికి ముందు తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారన్నాడు. దీంతో కోహ్లీ, బీసీసీఐ మధ్య విభేదాలు తలెత్తాయని స్పష్టంగా అర్థమవుతోంది.

ఇవీ చూడండి:

Kohli BCCI: వన్డే కెప్టెన్సీ వివాదం.. సునీల్‌ గావస్కర్‌ ఏమన్నాడంటే.?

Virat Kohli BCCI News: తప్పు ఎవరిదైనా.. ముగింపు పలకాలిక..!

'డర్టీ పాలిటిక్స్'.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details