స్టార్ క్రికెటర్ కోహ్లీకి ఫుట్బాల్ దిగ్గజ ప్లేయర్ రొనాల్డో అంటే ఎంత ఇష్టమో క్రీడా ప్రేమికులకు తెలిసిన విషయమే. ఇప్పటికే చాలా సార్లు అతడిపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నాడు. అయితే ఈ సారి రొనాల్డోను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు విరాట్.
"క్రీడా రంగానికి నువ్వు చేసిన సేవ ఎనలేనిది.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా అభిమానులను అలరించిన తీరు మరువలేనిది.. నువ్వు ఆడుతుంటే అలా చూస్తూ ఉండిపోవడం.. కేవలం నాకే కాదు.. నాలాంటి ఎంతో మంది అభిమానులకు దేవుడిచ్చిన వరం అది. ప్రతి మ్యాచ్‌లోనూ నీ కఠోర శ్రమ, నీ అంకితభావం మాకు కనిపిస్తూనే ఉంటుంది. వందకు వంద శాతం ఆటకు న్యాయం చేయడమే పరమావధిగా భావించగలగడం ఆటగాడికి దక్కిన ఆశీర్వాదం లాంటిది. ప్రపంచంలోని ప్రతి ఆటగాడికి అతడు స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అవుతాడు. నా దృష్టిలో అత్యుత్తమ ఆటగాడివి నువ్వే. మా అందరిని ఇంతగా అలరించిన నువ్వు ట్రోఫీ గెలవకపోతేనేం..? టైటిల్ సాధించకపోతేనేం? అదేమీ పెద్ద విషయం కానేకాదు. నీ ఆట తీరుతో మా మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న నీ గురించి వర్ణించడానికి ఎలాంటి ట్రోఫీలు, టైటిళ్లు అక్కర్లేదు" అని రాసుకొచ్చాడు