రోహిత్ శర్మకి తనకు ఆటకు సంబంధించిన విషయాల్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కోహ్లీ అన్నాడు. లోపాలను అధిగమించి జట్టును విజయపథంలో నడిపించేందుకు తామిద్దరు ప్రయత్నిస్తామని చెప్పాడు. అలాగే పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే తనకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో వివరించాడు.
"పెద్ద టోర్నమెంట్లలో ఎలా విజయం సాధించాలనే అంశంపై చర్చించుకుంటూ ఉంటాం. మా ప్రణాళిక, సన్నద్ధత అటువైపు ఉండేలా చూసుకుంటాం. కొన్నిరోజులపాటు ఆటకు దూరమై వచ్చినప్పటికీ జట్టులో అలాంటి వాతావరణం మాత్రం మారిపోలేదు. గ్రూప్‌లోని మిగతా ఆటగాళ్ల సహచర్యం అద్భుతం. ఇలా ఉంటే టీమ్ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు ముందడుగు వేస్తారు. ఆటను అర్థం చేసుకోవడంలో మా ఇద్దరి అభిప్రాయాలు, విజన్ ఒకటే. ప్రధాన లక్ష్యం సాధించే క్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, ఇబ్బందులను దాటుకొని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో సిద్ధమయ్యారు. కీలక సమయంలో ఒత్తిడిని ఎలా తట్టుకోగలరనేది ప్రధానం. భారీ మ్యాచుల్లో జట్టును సరైన మార్గంలో నడిపించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాం. ఒక్కసారి టోర్నీలో అడుగుపెడితే ఆటగాళ్లు దారిలోకి వచ్చేస్తారు" అని కోహ్లీ తెలిపాడు.