Kohli Captainy Darren sammy: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వివాదం టీమ్‌ఇండియాపై ప్రభావం చూపదని, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ చేతుల్లో జట్టు సురక్షితంగా ఉందని వెస్టిండీస్ మాజీ సారథి డారెన్ సామీ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లను ప్రోత్సహించడం, వారి నుంచి అత్యుత్తమమైన ప్రదర్శన బయటకుతీయడం రోహిత్‌కు బాగా తెలుసన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు విరాట్‌ను టీమ్‌ఇండియా సెలెక్టర్లు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించారు. అంతకుముందు అతడే స్వయంగా టీ20 సారథిగా తప్పుకొన్నాడు. ఇక తాజాగా టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం విరాట్ ఆ సారథ్య బాధ్యతల నుంచి కూడా వైదొలిగాడు. ఈ నేపథ్యంలోనే సామీ మాట్లాడుతూ.. ఈ పరిస్థితులన్నీ జట్టుపై ప్రభావం చూపవన్నాడు.
అలాగే కోహ్లీ కెప్టెన్‌గా పూర్తిగా తొలగిపోయినా బ్యాట్స్‌మన్‌గా జట్టుకు విలువైన ఆటగాడిగా ఉంటాడని సామీ అన్నాడు. కాబట్టి జట్టు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. "మైదానంలో కోహ్లీ తన ప్రదర్శనతో అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. మరోవైపు రోహిత్ ముంబయి ఇండియన్స్ తరఫున ఇప్పటికే మేటి సారథిగా నిరూపించుకున్నాడు. అతడో స్ఫూర్తిమంతమైన సారథి. ధోనీ, గంభీర్ లాంటి ఆటగాళ్లలా ఐపీఎల్‌లో తన జట్టును విజయపథంలో నడిపించాడు. వీళ్లంతా తమ ఆటగాళ్ల నుంచి సరైన ప్రదర్శన రాబట్టగలరు. వీళ్లు సహజంగానే విజయాలు సాధించి ట్రోఫీలు కైవసం చేసుకుంటారు. నేనైతే ఇప్పుడు టీమ్‌ఇండియా గురించి ఆందోళన చెందట్లేదు. అది ఇప్పుడు సురక్షితమైన వ్యక్తి చేతుల్లోనే ఉంది" అని విండీస్ మాజీ కెప్టెన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.