Kohli 300 Victories : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటేనే ఓ పరుగుల ప్రవాహం. ఏ దేశంలో ఆడినా.. పిచ్ ఎలాంటిదైనా.. అవతలున్నది ఎలాంటి బౌలరైనా.. క్రీజులో అడుగు పెడితే పరుగుల వరద పారాల్సిందే. అయితే ఆ మధ్యలో కొంతకాలం ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన అతడు.. ప్రస్తుతం తన 2.0లో విశ్వరూపం చూపిస్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ.. సెంచరీల మోత మోగిస్తున్నాడు.
ఇటీవలే కెరీర్లో 77వ అంతర్జాతీయ సంచరీ అందుకున్న అతడు.. ఈ క్రమంలోనే తాజాగా ప్రపంచ క్రికెట్‌లో మరో అత్యంత అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 300 విజయాల్లో భాగమైన ఆరో క్రికెటర్‌గా రికార్డుకు ఎక్కాడు. ఆసియా కప్ 2023లో భాగంగా సెప్టెంబర్ 12 జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంకపై టీమ్ఇండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతోనే విరాట్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు.
ప్రపంచ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ కన్నా ముందు కేవలం ఐదుగురు క్రికెటర్లు మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 377 విజయాల్లో భాగస్వామ్యమయ్యాడు. ఆ తర్వాత శ్రీలంక లెజెండరీ ప్లేయర్ మహేళ జయవర్ధనే 336, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ 307, దక్షిణాఫ్రికా ఆల్‌టైమ్ గ్రేట్ జాక్ కల్లిస్ 305, లంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర 305 వరుసగా ఉన్నారు.