తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ వందో టెస్టులో ఎన్ని రికార్డులో తెలుసా..? - భారత రికార్డులు

kohli 100 test record: భారత మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ వందో టెస్ట్​ అనేక రికార్డులకు వేదికగా నిలిచింది. శ్రీలంక భారత్​ల మధ్య జరిగిన టెస్ట్​లో ఆల్​రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్​ అశ్విన్​లు​ అరుదైన రికార్డులను సృష్టించారు.

india team
భారత జట్టు

By

Published : Mar 6, 2022, 10:51 PM IST

kohli 100 test record: భారత్ శ్రీలంకల మధ్య జరిగిన తొలి టెస్ట్​ అనేక రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లంకపై ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఒకే టెస్టులో 150+ పరుగులు.. 5కిపైగా వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు. జడేజా (175 నాటౌట్, 9/87) రికార్డు సృష్టించాడు. టెస్టు కెరీర్‌లోనూ జడేజాకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇప్పటి వరకు 58 టెస్టుల్లో 36.46 సగటుతో 2,370 పరుగులు సాధించాడు. అందులో రెండు శతకాలు, 17 అర్ధశతకాలు ఉన్నాయి. బౌలింగ్‌లో 241 వికెట్లను పడగొట్టాడు.

ఇక భారత్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ (435) అవతరించాడు. లంకతో టెస్టు సిరీస్‌కు ముందు 430 వికెట్లతో అశ్విన్‌ ఉన్నాడు. పర్యాటక జట్టుతో మొదటి టెస్టులో (5/95) రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అశ్విన్‌ ఐదు వికెట్లు తీయడంతో కపిల్ దేవ్ (434) రికార్డును అధిగమించాడు. టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మాజీ దిగ్గజ స్పిన్నర్‌ అనిల్ కుంబ్లే (619) పేరిట ఉంది.

భారత్‌-లంక తొలి టెస్టు మ్యాచ్‌ విశేషాలు..

  • తొలిసారి పూర్తిస్థాయి టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంపికైన రోహిత్ శర్మకు మొదటి విజయం. ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించిన రెండో టీమ్ఇండియా సారథి రోహిత్. అంతకుముందు 1955/56 సీజన్‌లో న్యూజిలాండ్‌పై ఇన్నింగ్స్‌ 27 పరుగుల తేడాతో పాలీ ఉమ్రిగర్ సారథ్యంలోనే భారత్‌ విజయం సాధించింది.
  • ఒకే టెస్టులో ఒకే రోజు ప్రత్యర్థికి చెందిన అదే ఆటగాడిని ఔట్ చేయడం టెస్టుల్లో ఇది ఏడో సంఘటన. ప్రస్తుతం లంకతో జరిగిన మ్యాచ్‌లో లక్మల్‌ను రవీంద్ర జడేజా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒకే రోజు ఔట్‌ చేయడం విశేషం.
  • ఒకే రోజు పదిహేనుకుపైగా వికెట్లను కోల్పోవడం ఇది శ్రీలంకకు మూడోసారి. 2017లో దక్షిణాఫ్రికాపై (16), 2022లో మొహాలీలో (16), 1994లో టీమ్‌ఇండియా మీదనే (15) వికెట్లను చేజార్చుకుంది.
  • లంకకు ఇది మూడో భారీ ఓటమి. గతంలో భారత్‌పై (1994) ఇన్నింగ్స్‌ 239 పరుగులు, దక్షిణాఫ్రికాపై (2001) ఇన్నింగ్స్‌ 229 పరుగుల తేడాతో ఓడింది.
  • కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే శ్రీలంకను భారత్‌ రెండు సార్లు ఆలౌట్‌ చేసింది. ఇవాళ ఒక్క రోజే 16 వికెట్లను భారత్‌ కూల్చింది. లంకకు చెందిన మొత్తం 20 వికెట్లలో భారత స్పిన్నర్లు అశ్విన్‌, జడేజా పదిహేను వికెట్లను తీశారు.
  • విరాట్ కోహ్లీ వందో టెస్టు ఆడాడు. ఇప్పటివరకు టెస్టులో 8వేల పరుగుల మైలురాయిని దాటిన ఆరో బ్యాటర్‌గా కోహ్లీ (8007) రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ 45 పరుగులను చేశాడు.

ఇదీ చదవండి:'కపిల్​ రికార్డును అధిగమిస్తానని అనుకోలేదు'

ABOUT THE AUTHOR

...view details