KL Rahul T20 : అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఇటీవలే టీమ్ ఇండియా జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో రోహిత్, కోహ్లీ కూడా ఉండటం విశేషం. వీరిద్దరు జట్టులోకి రావడం వల్ల ఈ ఏడాది జూన్ 1న ప్రారంభంకానున్న పొట్టి ప్రపంచకప్‌లోనూ ఆడటం ఖాయం అని తెలుస్తోంది. మరి కేఎల్ రాహుల్ విషయంలో బీసీసీఐ, జట్టు మేనేజ్‌మెంట్ ఏం ఆలోచిస్తోంది అన్నది అర్థం కావడం లేదు. ప్రస్తుతానికి టీ20 జట్టులో అతడిని పూర్తిగా దూరం పెట్టారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఖాళీ లేదనే చెప్పాలి : ప్రస్తుత టీమ్‌ఇండియా టీ20 జట్టులో రాహుల్(Teamindia KL rahul) కోసం ఖాళీ లేదనే చెప్పాలి. టీ20ల్లో రాహుల్ ఎక్కువగా ఓపెనర్‌గానే బరిలోకి దిగాడు. ఇప్పటివరకూ 72 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచుల్లో 37.75 యావరేజ్‌తో 2265 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 139.12గా ఉంది. రెండు సెంచరీలు కూడా బాదాడు. అయితే రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ రూపంలో గట్టి పోటీ నెలకొంది. దీంతో రాహుల్‌కు ఓపెనర్‌గా అవకాశం లేనట్టే అనే చెప్పాలి.
రీసెంట్గా వికెట్‌కీపర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా మూడు ఫార్మాట్లలోనూ ఆడాలని ఉందంటూ తన కోరికను బయట పెట్టాడు రాహుల్. ప్రస్తుతం వన్డేల్లో అతడు అదే స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మధ్యే దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ సుదీర్ఘ ఫార్మాట్లోనూ మొదటి సారి వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా మిడిలార్డర్‌లో కూడా ఆడాడు. అయితే టీ20ల్లో వికెట్‌కీపర్, మిడిలార్డర్ బ్యాటర్ల స్థానాలకు పోటీ నెలకొంది ఉంది. ప్రస్తుతం సంజు శాంసన్, జితేశ్ వికెట్‌కీపర్ బ్యాటర్లుగా ఉన్నారు. ఇంకా పంత్ కూడా ఐపీఎల్‌తో పునరాగమనం చేసి మంచిగా రాణిస్తే అతడే జట్టుకు మెయిన్ వికెట్‌కీపర్ అవుతాడు. అంటే రాహుల్‌కు చోటే ఉండదని చెప్పాలి. అయినా టీ20ల్లో రాహుల్ నిలకడగా రాణించట్లేదు. గత టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడిన రాహుల్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 128 రన్స్ మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేట్ 120.75గానే ఉంది. ఇక 2022లో ఆడిన 16 టీ20ల్లోనూ 28.93 యావరేజ్‌తో 434 పరుగులే చేశాడు.