టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రస్తుతం తన కెరీర్‌లో బ్యాడ్ ఫేజ్‌ను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఫామ్‌లేమీతో సతమతమవుతూ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో కూడా అతడి బ్యాట్ నుంచి సరైన ఇన్నింగ్స్ రావడం లేదు. పేలవ ప్రదర్శన చేస్తూ తన వైస్ కెప్టెన్ హోదాను కూడా పోగొట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ కలిపి అతడు 12.67 సగటుతో 38 పరుగులు మాత్రమే చేశాడు. జట్టులో అతడికి చోటు ప్రశార్థకంగా మారింది. నెటిజన్లు, మాజీలు అతడి ప్రత్యామ్నయంగా సూపర్ ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్‌ను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. రాహుల్ విశ్రాంతి తీసుకోవాలని అంటున్నారు. అయితే కేఎల్ ఇంత చెత్త ప్రదర్శన చేసినప్పటికీ.. అతడి ఖాతాలో మాత్రం ఓ ఘనత అలానే ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో కొనసాగుతున్నాడు.
వాస్తవానికి అతడు గత మూడేళ్లుగా టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన భారత బ్యాటర్లలో అతడు ఉన్నాడు. ఈ మూడేళ్లలో టెస్టు క్రికెట్‌లో అతడు మొత్తం రెండు సెంచరీలను బాదాడు. ఇక ఇదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు మొత్తం మూడు టెస్టు సెంచరీలను సాధించాడు. అతడితో సమానంగా రిషబ్ పంత్ కొనసాగుతున్నాడు. అతడు కూడా మూడు టెస్టు సెంచరీలు కొట్టాడు. వీరి తర్వాత కేఎల్ రాహుల్‌తో సమానంగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా రెండు శతకాలను బాదాడు. అలా రోహిత్ శర్మ, పంత్ చెరో మూడు శతకాలు, రవీంద్ర జడేజా, కేఎల్ రాహులు చెరో రెండు సెంచరీలను సాధించారు.
27 ఫిబ్రవరి 2020 నుంచి 27 ఫిబ్రవరి 2023 వరకు ఈ నలుగురి గణాంకాలను ఓ సారి పరిశీలిద్దాం. గత మూడేళ్లలో రోహిత్ శర్మ మొత్తంగా పదిహేను టెస్టు మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచుల్లో 27 ఇన్నింగ్స్ ఆడగా.. 47.16 సగటుతో మొత్తం 1179 పరుగులు సాధించాడు. ఇందులో హిట్‌మ్యాన్ మూడు సెంచరీలు, నాలుగు అర్ధ శతకాలు చేశాడు.
ఇక రిషబ్ పంతైతే మొత్తం 21 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. వీటిలో అతడు 36 ఇన్నింగ్స్‌లలో 44.63 సగటుతో 1,473 రన్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో మూడు శతకాలు, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి.