T20 World Cup 2022 : ప్రపంచకప్ కోసం సన్నద్ధతలో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో టీ20 సిరీస్‌లను ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. సెప్టెంబర్ 20న (మంగళవారం) ఆసీస్‌తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకొనేందుకు ఇదొక మంచి అవకాశం. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ గాడిలో పడాలి. మరీ ముఖ్యంగా ఆసియా కప్‌లో విఫలమైన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో రాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందిపుచ్చుకొని అదరగొట్టాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ పలు సూచనలు చేశాడు. వ్యక్తిగత మైలురాళ్ల మీద దృష్టిపెట్టకుండా జట్టుగా విజయంపైనే దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు.
"ఎవరో ఒకరు మంచి ఆరంభం ఇవ్వాలి. దానిని మిగతావారు కొనసాగించాలి. అయితే జట్టుగా విజయాలపైనే దృష్టిపెట్టాలి. అంతేకానీ వ్యక్తిగత ప్రదర్శనలకే పరిమితం కాకూడదు. ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ సెంచరీతో సహా పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాంతో ఒక్కసారిగా విరాట్‌ను ఓపెనింగ్‌కు పంపించాలని చర్చ ప్రారంభమైంది. చాలాకాలంపాటు రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ చేసిన ప్రదర్శన మాయమైపోయింది. ఇలాంటి కామెంట్లతో టాప్ ఆటగాళ్లను ఎప్పుడూ ఒత్తిడికి గురి చేయొద్దు.
కేఎల్ రాహుల్ వంటి ఆటగాడిని తక్కువగా అంచనా వేయొద్దు. నిజం చెప్పాలంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా కేఎల్ రాహుల్‌లోనే ఎక్కువ సత్తా ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో సహా భారత టీ20 లీగ్‌లోనూ చూశాం. మనం వ్యక్తిగతంగా కాకుండా టీమ్‌ఇండియా కోణంలో చూడాల్సిన అవసరం ఉంది" అని గంభీర్ వివరించాడు. అయితే ఆసీస్ మాజీ ఆటగాడు మ్యాథ్యూ హేడెన్ మాత్రం విరాట్ కోహ్లీ ఓపెనింగ్‌కు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలోని ఫాస్ట్ పిచ్‌లపై విరాట్ కోహ్లీ బాగా ఆడతాడని హేడెన్ తెలిపాడు.