KL Rahul Donation: అత్యంత అరుదైన రక్త రుగ్మతతో బాధపడుతున్న 11ఏళ్ల వరద్‌కు భారీ ఆర్థిక సాయం చేసి తన గొప్పమనసు చాటుకున్నాడు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్. ఆ చిన్నారి ఎముక మజ్జ మార్పిడి (బోన్ మ్యారో) కోసం రూ.31 లక్షలు విరాళంగా ఇచ్చాడు. నిధులు సమకూరుస్తున్న గివ్ ఇండియా ద్వారా విషయాన్ని తెలుసుకున్న రాహుల్ చలించిపోయాడు. దీంతో తన బృందం ద్వారా వరద్ తల్లిదండ్రులను సంప్రదించి.. ఆపరేషన్‌కు కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందజేశాడు.
సకాలం రాహుల్ సాయం చేయడంతో వరద్ ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాహుల్ సంతోషం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఆ చిన్నారి తన కలలను సాధించాలని రాహుల్ ఆకాంక్షించాడు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తన ఈ ప్రయత్నం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నట్లు రాహుల్ తెలిపాడు.