ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి అర్ధ శతకంతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్(KL Rahul News) టీమ్ఇండియాకు గొప్ప ఆస్తి అని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(Kapil Dev on KL Rahul) ప్రశంసించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టులో కీలక ఆటగాడిగా మారుతాడని పేర్కొన్నాడు. "నేను కేల్ రాహుల్ ఆటను ఆస్వాదిస్తాను. అతడు చాలా కాన్ఫిడెంట్‌తో షాట్లు ఆడతాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో గొప్పగా రాణించిన రాహుల్ ఈ టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) కూడా అదే స్థాయిలో ఆడతాడని అనుకుంటున్నా. భవిష్యత్తులో అతడు భారత జట్టుకు మరిన్ని సేవలందిస్తాడు" అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
"రవిశాస్త్రి నేతృత్వంలో టీమ్ఇండియా ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాను సొంత గడ్డపైనే రెండుసార్లు ఓడించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉంది. విదేశీ గడ్డపై సిరీస్‌లు గెలవడమంటే మామూలు విషయం కాదు. కానీ, భారత్ వరుసగా విజయాలు సాధిస్తోంది. కోచ్‌గా రవిశాస్త్రికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కాబట్టి భారత్ ఈ సారి కూడా మెరుగ్గా రాణించి ఛాంపియన్‌గా నిలవాలని కోరుకుంటున్నా. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రశాంతమైన ఆటగాడు. ఇటీవల ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగోసారి విజేతగా నిలిపాడు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా వ్యవహరిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. చాలా రోజుల తర్వాత ధోనీ డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించడం వల్ల యువ ఆటగాళ్లు ఉత్సాహంతో కనిపిస్తున్నారు. తన అనుభవం, ఆలోచనలతో టీమ్ఇండియాను అతడు కచ్చితంగా ప్రభావితం చేయగలడు."
- కపిల్ దేవ్, మాజీ సారథి.