Cummins Fastest Fifty: కమిన్స్ రూపంలో సునామీ ముంబయిని ముంచెత్తింది. అనూహ్యమైన షాట్లు ఆడుతూ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి 15 బంతుల్లోనే 56 పరుగులతో అజేయంగా నిలిచి కథ ముగించాడు. ఈ క్రమంలోనే 14 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి.. ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సమం చేశాడు. 2018లో దిల్లీపై పంజాబ్ తరఫున కేఎల్ రాహుల్ కూడా 14 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ చేశాడు.
కోల్‌కతా విజయానికి చివరి అయిదు ఓవర్లలో 35 పరుగులు కావాలి. మ్యాచ్ మరో మూడు ఓవర్లయినా సాగుతుందని అందరూ అనుకున్నారు. కానీ కమిన్స్ ఆ అవకాశమే ఇవ్వలేదు. ఒక్క ఓవర్లోనే కథ ముగించాడు. సామ్స్ (1/50) బౌలింగ్‌లో వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను.. ఆ తర్వాత చివరి రెండు బంతులను 4, 6గా మలచి 16వ ఓవర్లోనే జట్టుకు విజయాన్ని అందించాడు. బంతి ఎలా, ఎక్కడ పడ్డా దానికి బౌండరీ దారే చూపించాడు. మధ్యలో ఓ బంతిని బౌండరీ దగ్గర సిక్సర్ వెళ్లకుండా సూర్య అద్భుతంగా అందుకున్నప్పటికీ అది నోబాల్‌గా తేలింది. 162 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఛేదించింది కోల్‌కతా.ముంబయి ఇండియన్స్‌పై కమిన్స్‌కు మంచి రికార్డు ఉంది. గత 3 ఇన్నింగ్స్‌ల్లో 33(12 బంతుల్లో), 53*(36 బంతుల్లో), 56*(15 బంతుల్లో) చొప్పున చేశాడు.