IPL 2022 First Match: టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ ఎప్పుడో తెలిసిపోయింది. పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌లో మ్యాచ్‌ల ఫార్మాట్ తెలిసింది. షెడ్యూల్‌తోపాటు తొలి మ్యాచ్ ఎవరెవరి మధ్య జరగనుంది.. వేదిక ఎక్కడనేది మాత్రమే అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన జట్ల మధ్యే ఈసారి మొదటి మ్యాచ్ ఉండనుంది.
మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ మే 29న ముగియనుంది. కొత్తగా చేరిన రెండు ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం పది జట్లు 15వ సీజన్‌లో పాల్గొంటాయి. రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఒక్కో జట్టు పద్నాలుగేసి మ్యాచ్‌లను ఆడాలి. దీంతో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇవే కాకుండా ఫైనల్‌తో కలిపి నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఉంటాయి. గత సీజన్ ఫైనలిస్ట్‌లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్ ట్రోఫీని ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే గెలుచుకుంది.