ఐపీఎల్.. ఈ మెగాలీగ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చిన్న క్రికెటర్ల నుంచి మేటి క్రికెటర్ల వరకు ఈ మెగా టోర్నీలో ఆడేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ లీగ్‌లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ టోర్నీ నిర్వహించే సమయంలో సొంత దేశంలో సిరీస్‌లు ఉన్నా.. ఇందులో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇప్పుడి న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా అదే చేశాడు! ఐపీఎల్ కోసం.. అతడిని ఆ దేశ క్రికెట్ బోర్డు ముందే విడిచిపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆడుతున్న విలియమ్సన్ వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు. దీంతో ఆ వన్డే సిరీస్‌లో కివీస్ టీమ్‌కు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇకపోతే గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్‌లో విలియమ్సన్‌ను.. గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న అతడు.. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు.. ఐపీఎల్ కోసం విలియమ్సన్తో పాటు డేవాన్ కాన్వే(చెన్నై సూపర్ కింగ్స్), టిమ్ సౌథీ(కోల్‌కతా నైట్ రైడర్స్), మిచెల్ సాంట్నర్‌ను(చెన్నై సూపర్ కింగ్స్) కూడా వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త యంగ్ ప్లేయర్లు ఆడనున్నారు. ఇప్పటికే లంకతో మూడు వన్డేల సిరీస్ కోసం చాడ్ బోవాస్, బెన్ లిస్టర్‌ను న్యూజిలాండ్ బోర్డ్ సెలెక్ట్ చేసింది. అలానే మార్చి 25న జరగనున్న తొలి వన్డే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్(కోల్‌కతా నైట్ రైడర్స్), ఫిన్ అలెన్(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), గ్లెన్ ఫిలిప్(సన్‌రైజర్స్ హైదరాబాద్) కూడా ఐపీఎల్ కోసం భారత్‌కు చేరుకోనున్నారు.