Kane Williamson Icc World Cup 2023 : ఈసారి ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌నకు భారత్ ఆతిథ్యమిస్తోంది. అక్టోబర్‌లో ఈ మెగాటోర్నీ ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ సమరానికి దగ్గరపడుతోంది. ఈ క్రమంలో టోర్నీకి భారత జట్టు ఎలా ఉండబోతోందనే విషయమై ఓవైపు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదే సమయంలో టీమ్ఇండియా అభిమానుల దృష్టి ఓ విదేశీ ఆటగాడి మీద పడింది. అతడు ఈ వరల్డ్‌కప్‌లో ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఆ ప్లేయర్ మరెవరో కాదు టీమ్ఇండియా అభిమానుల్లో ప్రత్యేక స్థానం సంపాందించుకున్న.. ముఖ్యంగా హైదరాబాదీలకు సుపరిచితుడు కేన్ మామ.. అదే న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్.
అయితే, కొందరు ప్రేయర్లు.. తమ ఆటతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకుని.. దేశాల అంతరాలను చెరిపివేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటాు. అలాంటి కోవకు చెందిన ఆటగాడే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్. మామూలుగానే న్యూజిలాండ్ క్రికెటర్లను అందరూ ఇష్టపడతారు. జెంటిల్‌మన్ గేమ్‌గా పిలిచే క్రికెట్‌ను జెంటిల్‌మెన్‌లాగే ఆడతారు ఆ దేశ ప్లేయర్లు. ప్రత్యర్థి ఆటగాళ్లను పల్లెత్తు మాట అనుకుండా.. ఆటలో తొండికి తావు లేకుండా.. వివాదాల జోలికి వెళ్లకుండా.. పద్ధతిగా ఆడటం న్యూజిలాండ్ ఆటగాళ్ల శైలి. అందులోనూ కేన్ విలియమ్సన్ అంటే మర్యాదరామన్న తరహానే. ప్రత్యర్థి ప్లేయర్లతో కలుపుగోలుగా ఉంటాడు. అందరినీ గౌరవిస్తాడు.
ఇక కేన్ విలియమ్సన్ ఆట విషయానికి వస్తే.. గత దశాబ్ద కాలంగా ఫార్మాట్లతో సంబంధం లేకుండా ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, జో రూట్‌ల సరసన నిలుస్తూ మోడర్న్ గ్రేట్స్‌లో ఒకడిగా కితాబులందుకుంటున్నాడు. న్యూజిలాండ్ దేశస్థులే కాదు.. వరల్డ్‌వైడ్‌గా అనేక దేశాల్లో కేన్‌కు అభిమానులు ఉన్నారు. ఇక ఇండియాలో అతడికి వీరాభిమానులే ఉన్నారని చెప్పొచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్- ఐపీఎల్ ఆడుతూ ఇక్కడ భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకున్నాడు. అందరూ మెచ్చే ఇలాంటి మేటి ఆటగాడు.. వరల్డ్ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడాలని ప్రతి క్రికెట్ అభిమానీ కోరుకుంటాడనడం అతిశయోక్తి కాదు. అయితే అనుకోని గాయం అతడు ఇండియా రావడంపై సందేహం నెలకొనేలా చేసింది.
ఐపీఎల్‌లో ఆ చేదు జ్ఞాపకం..
Kane Williamson Injury Update World Cup : గత ఐపీఎల్ సీజన్ వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కేన్ ఆడాడు. ఆ తర్వాత సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు మారాడు. ఆ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే అతను అనూహ్యంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తూ కాలు మడతపడటం వల్ల గ్రౌండ్ బయటికి నడిచి కూడా వెళ్లలేని పరిస్థితిలో.. ఇద్దరు సహాయకులు అతడిని తమ భుజాలపై మోసుకెళ్లారు. గాయం తీవ్రత దృష్ట్యా వెంటనే కేన్ న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. ఆ శస్త్ర చికిత్స జరిగి అయిదు నెలలు దాటింది. ఇంకా కేన్ పూర్తిగా కోలుకోలేదు. అతడి లేకుండానే న్యూజిలాండ్ జట్టు.. టామ్ లేథమ్ కెప్టెన్సీలో ఆడుతోంది. న్యూజిలాండ్ బలమైన జట్టే అయినా.. విలియమ్సన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.