పాకిస్థాన్ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలని ఆ జట్టు ఫాస్ట్‌బౌలర్ జునైద్‌ఖాన్ అభిప్రాయపడ్డాడు. తాజాగా అతడు ఒక స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో సమీప భవిష్యత్‌లో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లుండవని అంచనా వేశాడు.
వారే సరైనోళ్లు..
"పాక్ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కొనేలా సన్నద్ధమవ్వాలంటే టీమ్‌ఇండియాతో ఆడాలి. రెండు జట్లపైనా ఒత్తిడనేది చాలా ఉంటుంది. ఆ వాతావరణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఇరు దేశాల మధ్య క్రమం తప్పకుండా క్రికెట్ జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ.. పరిస్థితులను చూస్తే సమీప భవిష్యత్‌లో అది జరిగేలా అనిపించడం లేదు. అలాగే నేను 2012-13లో టీమ్‌ఇండియా పర్యటనకు వెళ్లినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నా. అప్పుడే ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నా. దాంతో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగితే ఇరు జట్ల ఆటగాళ్లకు చాలా మంచిది. అది రెండు దేశాల అభిమానులను సంతోషపెడుతుంది" అని పాక్ పేసర్ చెప్పుకొచ్చాడు.