Bairstow Ruled Out : ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టో టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈ టోర్నీ సహా రానున్న కొద్దికాలంలో ఇంగ్లాండ్ ఆడనున్న అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేనని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడీ క్రికెటర్.
శుక్రవారం ఉదయం గోల్ఫ్ ఆడుతున్న సమయంలో అనుకోకుండా తన ఎడమకాలి దిగువ భాగంలో గాయమైందని, దానికి ఆపరేషన్ అవసరమని పోస్ట్ పెట్టాడు. బలంగా తిరిగొస్తానని పేర్కొన్న బెయిర్‌స్టో, టీ20 వరల్డ్‌కప్‌కు వెళ్లనున్న ఇంగ్లాండ్ టీంకు శుభాకాంక్షలు చెప్పాడు.
శుక్రవారమే టీ20 ప్రపంచకప్ ఆడనున్న ఇంగ్లాండ్ టీంను ప్రకటించింది బోర్డు. అందులో బెయిర్‌స్టో పేరును ఉంచింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బెయిర్‌స్టో తప్పుకోవడం గమనార్హం. అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా బెయిర్‌స్టో.. టీ20 వరల్డ్‌కప్ ఆడట్లేదని ట్వీట్ చేసింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రికెటర్లు, అభిమానులు కూడా బెయిర్‌స్టో త్వరగా కోలుకొని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ట్వీట్లు చేస్తున్నారు.
బెయిర్‌స్టో స్థానంలో మరే ఇతర ఆటగాడి పేరును ప్రకటించలేదు ఇంగ్లాండ్ జట్టు. ఆస్ట్రేలియా వేదికగా టీ-20 ప్రపంచకప్ అక్టోబర్ 16న మొదలవనుంది. ఈసారి ఇంగ్లాండ్ టీంలో జేసన్ రాయ్‌కు చోటు దక్కలేదు. టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను పునరాగమనం చేయనున్నాడు. జాస్ బట్లర్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు.