Archer Surgery: జోఫ్రా ఆర్చర్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. అనతి కాలంలోనే ఇంగ్లాండ్ జట్టులో స్టార్ పేసర్‌గా ఎదిగాడు. నిప్పులుచెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టిన ఇతడు.. గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. కానీ త్వరలోనే ఇతడు మైదానంలో అడుగుపెడతాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలింది. ఇతడి గాయం గురించి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర విషయం వెల్లడించింది.
ఆర్చర్‌కు మరో సర్జరీ.. వేసవి వరకు ఆటకు దూరం - జోఫ్రా ఆర్చర్ చికిత్స
Archer Surgery: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అభిమానులకు నిరాశే మిగిలింది. గాయం నుంచి కోలుకుని త్వరలో మైదానంలో అడుగుపెడతాడనుకున్న ఈ బౌలర్‌కు మరోసారి చికిత్స జరిగింది. దీంతో మరికొంతకాలం ఇతడు బరిలో దిగే అవకాశం లేదని బోర్డు తెలిపింది.
"డిసెంబర్ 11న లండన్‌లోని ఓ ఆస్పత్రిలో ఆర్చర్‌కు రెండోసారి చికిత్స జరిగింది. చాలాకాలంగా అతడిని వేధిస్తున్న మోచేయి సర్జరీ విజయవంతంగా పూర్తయింది. అతడు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అందువల్ల వింటర్ సీజన్లో అతడు మైదానంలో బరిలో దిగే అవకాశం లేదు" అని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో టీమ్ఇండియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరిసారిగా పాల్గొన్నాడు ఆర్చర్. ఈ సిరీస్‌లో 7.75 ఎకానమీతో 7 వికెట్లు దక్కించుకున్నాడు. తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమయ్యాడు. దీంతో భారత్‌తో పాటు యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. రెండోసారి చికిత్స చేసుకున్న కారణంగా ప్రస్తుత యాషెస్‌తో పాటు త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు.