Joe Root vs Sachin Tendulkar : క్రికెట్లో.. ఆటగాళ్ల అసాధారణమైన ప్రతిభ బయటపడే వరకు.. వారు రికార్డులు సాధించలేరు. అలాంటి అసాధారణమైన ప్రతిభ కనబరిచి.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా టీమ్ఇండియా మాజీ ఆటగాడు సచిన్ తెందుల్కర్ నిలిచాడు. 200 టెస్టులు ఆడిన సచిన్.. 15,921 స్కోరుతో టెస్ట్ క్రికెట్లోనే అత్యధిక పరుగులు సాధించి.. ఓ బెంచ్‌మార్క్‌ను నెలకొల్పాడు. సచిన్ నమోదు చేసిన ఈ రికార్డును ఎవరు బద్దలుగొడతారు అని కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది.
Joe Root Test Runs : అయితే, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ 11,000 పరుగులు పూర్తి చేశాడు. ఇటీవల లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జో రూట్.. వేగంగా అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తాజాగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వేదికగా ప్రారంభమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులో మొదటి రోజు జోరూట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 152 బంతుల్లో 118 స్కోర్ చేసిన జో రూట్ తన శతకంతో స్టేడియంను ఓ ఊపు ఊపేశాడు. దీంత ఇంగ్లాండ్ తరఫున్ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా నిలిచి.. మరో ఇంగ్లాండ్ ప్లేయర్ అలిస్టర్ కుక్, శ్రీలంక బ్యాట్ కుమార సంగక్కరను వెనక్కి నెట్టాడు. దీంతోపాటు తన టెస్ట్ కెరీర్లో 30వ సెంచరీని సాధించి డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును బద్దలుగొట్టాడు.
దీంతో అతడే సచిన్ తెందూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు రూట్ అసాధారణమైన ప్రతిభ, మంచి ఫామ్‌తో నిలకడగా ప్రదర్శనలు చేస్తుండటం వల్ల ఆ చర్చకు మరింత బలం చేకూరుతోంది. జోరూట్.. సచిన్ రికార్డును బద్దలుగొడతాడు అనడానికి ప్రధాన కారణాలివే.
నిలకడ, పరుగులు తీసే సామర్థ్యం..
సచిన్ తెందూల్కర్ రికార్డును బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాళ్లలో జో రూట్ ముందు వరసలో ఉన్నాడు. దానికి ప్రధానం కారణం అతడి నిలకడ, కచ్చితంగా పరుగులు రాబట్టగల సామర్థ్యం. జో రూట్ టెస్టు క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. వేగంగా పరుగులు రాబట్టాడు. అతడికి మంచి టెక్నిక్ ఉంది. ఎలాంటి బౌలింగ్ పరిస్థితుల్లో అయినా.. తన వైడ్ రేంజ్ షాట్లతో పరుగులు సాధిస్తాడు.
Joe Root Stats : అర్ధసెంచరీలను నిలకడతో సెంచరీల వైపు పరుగులు పెట్టిస్తాడు. ప్రతినిత్యం పరుగుల ఆకలితో పరితపిస్తాడు. ఈ కారణాలే సచిన్ రికార్డుకు ప్రమాదంగా మారాయి. టెస్టుల్లో రూట్ ఇప్పటివరకు 50.24 సగటుతో పరుగులు చేశాడు. అలా అతడి కెరీర్ మొదటి నుంచి అద్భుతమైన నిలకడ ప్రదర్శించాడు. అయితే, రూట్ ఇదే నిలకడ కొనసాగిస్తే.. దాదాపు 98 ఇన్నింగ్స్ అంటే 49 టెస్టుల్లో మిగతా 4,917 పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంది.