తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేయర్లకే కాదు- జెర్సీ నంబర్లకూ రిటైర్మెంట్- మీకు ఈ విషయం తెలుసా? - సచిన్ జెర్సీ రిటైరె్ట

Jersey Numbers Retired : క్రీడా రంగంలో ఆటగాళ్లు రిటైర్మెంట్ తీసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వారు ధరించే జెర్సీ నంబర్లకు కూడా ఉంటుందని మీకు తెలుసా? ఇటీవల ఓ ప్రఖ్యాత ఆటగాడి జెర్సీ నంబర్​కు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా రిటైర్మెంట్ ఇచ్చిన జెర్సీ నంబర్లు, అవి ఏ ఆటగాళ్లవో తెలుసుకుందాం.

Jersey Numbers Retired
Jersey Numbers Retired

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2023, 9:27 AM IST

Updated : Dec 28, 2023, 10:14 AM IST

Jersey Numbers Retired : భారత్ క్రికెట్​ జట్టు మాజీ సారథి, స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ పేరు ఇటీవల ఫుల్ ట్రెండింగ్​లోకి వచ్చింది. దానికి కారణం ఆయన జెర్సీ నంబర్​కు బీసీసీఐ రిటైర్మెంట్ ఇచ్చింది. టీమ్​ఇండియాకు రెండు ఐసీసీ ప్రపంచ కప్​లు అందించిన కెప్టెన్​కు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంటే భవిష్యత్తులో ఆ నంబర్​తో ఉన్న జెర్సీని ఏ ఆటగాడు కూడా ధరించలేడు.

భారత క్రికెటర్లలో ధోనీ కన్నా ముందు సచిన్​ జెర్సీకి బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించింది. మిస్టర్ కూల్​కు 7 నంబరు అంటే సెంటిమెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఏడో నెల ఏడో తేదీనే జన్మించాడు. పైగా లక్కీ నంబర్ కూడా 7 కావడం విశేషం. అందుకే తన దశాబ్దన్నర సుదీర్ఘ కెరీర్లో జెర్సీ నెం.7 ధరించి బరిలోకి దిగాడు.

అయితే ధోనీ జెర్సీ నంబర్​కు రిటైర్మెంట్ ప్రకటించాలని మొదటగా ప్రతిపాదించింది వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ధోనీ రాకతో ఈ క్రికెటర్ తన ఉనికి కోల్పోయాడు. అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్, మరోవైపు కెప్టెన్ గా ధోనీ రాణించడంతో దినేశ్​కు అవకాశాలు రావడం క్లిష్టంగా మారాయి. ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రోజే డీకే జెర్సీ రిటైర్మెంట్ స్టేట్​మెంట్ ఇచ్చాడు.

జెర్సీ నంబర్​కు రిటైర్మెంట్ ఇచ్చే అధికారం ఏదైనా గవర్నింగ్ బోర్డు లేదా క్లబ్​కు ఉంటుంది. మన ఇండియాలో క్రికెట్​కు సంబంధించి బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కి అధికారం ఉంది. ఈ నిర్ణయాన్ని కూడా బోర్డే తీసుకుంది. తర్వాత ఈ విషయాన్ని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికంగా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా రిటైర్మెంట్ అయిన జెర్సీల గురించి ఓ సారి తెలుసుకుందామా?

మొదట ప్రారంభించింది క్రికెట్ ఆస్ట్రేలియా
జెర్సీ నంబర్ల రిటైర్మెంట్ విషయంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ దివంగత ఫిలిప్ హ్యూస్​కు తొలి గౌరవం దక్కింది. 2014 లో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తీవ్రంగా గాయపడి దురదృష్టవశాత్తు మరణించాడు. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (క్రికెట్ ఆస్ట్రేలియా) అతడి జెర్సీ నంబర్ 64కు రిటైర్మెంట్ ప్రకటించింది.

ఇక ఇండియా విషయానికి వస్తే.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ జెర్సీ నెం.10కు మొదట రిటైర్మెంట్ ఇచ్చింది ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్. ముంబయి జట్టుకు సచిన్.. 2008-2013 మధ్య ప్రాతినిథ్యం వహించాడు. ఆ తర్వాత 2017లో బీసీసీఐ సైతం అతడి జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది.

ప్రమాణాలు పాటించిన కివీస్ బోర్డు
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్-2019 తరువాత న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఆ జట్టు మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరి జెర్సీ నంబరుకు రిటైర్మెంట్ ఇచ్చింది. న్యూజిలాండ్ తరఫున వెటోరీ 437 మ్యాచులు ఆడి ఆ సమయంలో అత్యధిక మ్యాచులు ఆడిన క్రికెటర్​గా నిలిచాడు. మాజీ ఆటగాళ్ల జెర్సీలను రిటైర్ చేయడానికి నిర్దిష్ట ప్రమాణాలను పాటించిన మొదటి అంతర్జాతీయ క్రికెట్ బోర్డుగా NZC నిలిచింది.

న్యూజిలాండ్ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ వన్డేలు ఆడిన ఆటగాళ్లందరి జెర్సీలకు రిటైర్మెంట్ ప్రకటించింది. ఆ తర్వాతి కాలంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ (279), బ్రెండన్ మెక్ కల్లమ్ (260), క్రిస్ హారిస్ (250), రాస్ టేలర్ (236), నాథన్ ఆస్టెల్ (223), క్రిస్ కెయిర్న్స్ (214) జెర్సీలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించింది.

ఈ జాబితాలో నేపాల్ కూడా!
తమ అత్యంత విజయవంతమైన కెప్టెన్ పరాస్ ఖడ్కా గౌరవార్థం నేపాల్ క్రికెట్ బోర్డు (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్) జెర్సీ నంబర్ 77ను కూడా రిటైర్ చేసింది. అతను నేపాల్ తరఫున 10 వన్డేలు, 33 టీ20 లు ఆడాడు. వైట్ బాల్ ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి నేపాల్ ఆటగాడిగా నిలిచాడు. లెజెండరీ స్పిన్నర్ దివంగత షేన్ వార్న్ జెర్సీ నంబర్ 23 కూడా రిటైర్ అయింది. కానీ అంతర్జాతీయ క్రికెట్​లో కాదు. బిగ్ బాష్ లీగ్​లో.

సచిన్ జెర్సీ నంబర్​కు అంతర్జాతీయ రిటైర్మెంట్ లేదు. కాబట్టి ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు నెం.10 జెర్సీని ధరించవచ్చు. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, పాకిస్థాన్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిలు ప్రస్తుతం జెర్సీ నెం.10 ధరిస్తున్నారు. షాహిద్ అఫ్రిది, అలెన్ డోనాల్డ్, క్రెయిగ్ మెక్ మిలాన్, జెరైంట్ జోన్స్, స్టువర్ట్​లా వంటి రిటైర్డ్ క్రికెటర్లు గతంలో ఈ జెర్సీ నంబర్​ను వేసుకునే వారు. భారత క్రికెటర్ శార్దుల్ ఠాకూర్ ఓ సారి అనుకోకుండా జెర్సీ నం.10 ధరించి ట్రోలింగ్​కు గురయ్యాడు.

Last Updated : Dec 28, 2023, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details